చాందీపుర వైరస్‌లతో మరణాలు
కేరళలో నిఫా వైరస్ సోకి 14 ఏళ్ల బాలుడి మృతి
గుజరాత్‌లో చాందీపుర ఎఇఎస్
కారణంగా 16 మంది మృత్యువాత
రోగి నుంచి వెలువడే స్రావాల ద్వారా మాత్రమే నిఫా వ్యాప్తి
దోమలు, ఈగలు, కీటకాల ద్వారా చాందీపుర వ్యాపిస్తుంది
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలో వైరస్‌లు మళ్లీ కలకలం రేపుతున్నాయి. కొవిడ్ కంటే ప్రమాదకరమైనదిగా పేర్కొనే నిఫా వైరస్ కేరళలో మరోసారి కలకలం రేపగా, గత కొన్ని రోజులుగా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో ఛాందీపుర వైరస్ అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్(ఎఇఎస్) కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కేరళలో మళప్పురం జిల్లాలోని పండిక్కడ్‌కు చెందిన 14ఏళ్ల బాలుడికి నిఫా వైరస్ సోకినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.
పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఈ విషయాన్ని నిర్ధరించిందని, ప్రైవేటు ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఆ బాలుడు చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. బాధితుడిని కోజికోడ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించనున్నట్లు తెలిపారు. అతడికి ఎవరెవరు దగ్గరగా వచ్చారన్నది ఆరా తీస్తున్నట్లు వివరించారు. ఇంతలోనే బాలుడు మృతిచెందారన్నారు. అంతర్జాతీయ నిబంధనలు పాటించి అంత్యక్రియలు నిర్వహిస్తామని వీణాజార్జ్ చెప్పారు. దీనిపై బాలుడి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులతో జిల్లా కలెక్టర్ మాట్లాడి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
నిఫా..కొవిడ్ కంటే ప్రమాదకరం
కొవిడ్‌తో పోలిస్తే నిఫా వైరస్ అత్యంత ప్రమాదకరమైంది. నిఫా వైరస్ సోకినట్లు నిర్థారించిన కొన్ని గంటల వ్యవధిలోనే బాలుడు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో నిఫా వైరస్ ఉత్పరివర్తనం చెంది.. వ్యాప్తించే సామర్థ్యాన్ని మరింత పెంచుకుని.. మరింత మందికి విస్తరిస్తుందా..? అనే భయాలు మొదలయ్యాయి. దీనికి తోడు నిఫా వైరస్‌లో మరణాల శాతం యాభైకి పైగా ఉండటం, దీనికి ప్రత్యేకమైన టీకాలు, చికిత్స లేకపోవటం ఆ భయాలను మరింత పెంచుతున్నాయి. అయితే కొవిడ్ అంత వేగంగా నిఫా వైరస్ వ్యాపించకపోవడం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. రోగి నుంచి వెలువడే స్రావాల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ముఖ్యంగా రక్తం, మూత్రం, ముక్కు, నోటి నుంచి వచ్చే స్రావాల్లో వైరస్ ఉంటుంది. కరోనా వైరస్ మాదిరిగా కాకుండా వ్యాధి సోకిన వ్యక్తితో.. సన్నిహితంగా మెలిగిన ప్రైమరీ కాంటాక్టు వ్యక్తులకే నిఫా వైరస్ సోకుతోంది. సామూహిక వ్యాప్తి ఇప్పటివరకు వెలుగు చూడకపోవటం ఊరటనిస్తోంది. ఇదే సమయంలో కొవిడ్ తరహాలో కాకుండా నిఫా వైరస్‌లోని ప్రోటీన్లు మెదడు, కేంద్ర నాడీకణాల్లోనే కేంద్రీకృతమవుతున్నాయి. కొవిడ్ వైరస్ తరహాలో నిఫా వైరస్ ఎగువ శ్వాసకోశంలో ప్రతిరూపకాలను తయారుచేసే అవకాశాలు తక్కువ.
మహమ్మారిగా మారే అవకాశాలు తక్కువే
ప్రస్తుతం నిపా వైరస్ వ్యాపిస్తున్న తీరు చూస్తే.. దీనికి మహమ్మారిగా మారే అవకాశాలు తక్కువగా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. కాంటాక్ట్ ట్రేసింగ్, ప్రజల్లో అవగాహన, ప్రజారోగ్య చర్యలు అవసరమని సూచిస్తున్నారు. నిఫా వైరస్‌కు టీకాలను అభివృద్ధి చేసే ముందు నిఫా వైరస్ మహమ్మారిగా మారే ప్రమాదముందా అనే విషయాన్నిఅంచనా వేయాలని చెబుతున్నారు. నిపా వైరస్‌ను 1989లో మలేషియాలో తొలిసారిగా గుర్తించారు. నిఫా వైరస్ ఆతిథ్య జీవుల జాబితాలో.. పందులు, ఫ్రూట్ బ్యాట్ అనే గబ్బిలాలు, కుక్కలు, మేకలు, గొర్రెలు, పిల్లులు, గుర్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్రూట్ బ్యాట్స్‌లో ఇవి సహజంగానే ఉంటాయి. అయితే వాటిపై ఎటువంటి ప్రభావం చూపించలేవు. వైరస్ ఉన్న గబ్బిలాలతో ప్రత్యక్ష లేదా పరోక్ష కాంటాక్ట్ ద్వారానే.. నిఫా వైరస్ మనుషులకు వ్యాపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వ్యాధి సోకిన గబ్బిలాల మూత్రం పండ్లు మీదకి చేరినప్పుడు.. ఆ పండ్లు, పళ్ల రసాల ద్వారా మనుషులకు వ్యాపించే ప్రమాదముందని పేర్కొంటున్నారు.
ఆందోళన కలిగిస్తున్న చాందీపుర కేసులు
గత కొన్ని రోజులుగా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో చాందీపుర వైరస్ అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యాధి కారణంగా గుజరాత్‌లో 16 మంది ప్రాణాలు కోల్పోయారని, మొత్తం రాష్ట్రంలో 50 చండీపురా వైరస్ కేసులు నమోదయ్యాయని గుజరాత్ ఆరోగ్య మంత్రి రుషికేష్ పటేల్ తెలిపారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. పలువురు నిపుణులతో కలిసి గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్, చండీపురా వైరస్ కేసులను సమీక్షించింది.
ఈ క్రమంలో గుజరాత్‌లో కనుగొనబడిన ఎఇఎస్ కేసులపై వివరణాత్మక దర్యాప్తు అవసరమని అధికారులు అన్నారు. దర్యాప్తులో గుజరాత్ రాష్ట్రానికి సహకరించేందుకు కేంద్ర బృందాన్ని రంగంలోకి దింపారు. ఈ వైరస్ సంక్రమణ పెరుగుతున్న దృష్ట్యా, ఆరోగ్య శాఖ బృందాలు మొత్తం 17,248 ఇళ్లలోని 121826 మందిని పరీక్షించాయి. దీంతోపాటు రెండు రాజస్థాన్ నుంచి, ఒకటి మధ్యప్రదేశ్ నుంచి కూడా కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు.
చండీపురా వైరస్ అంటే ఏమిటి..?
మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని చాందీపూర్ గ్రామంలో 1966లో 15 ఏళ్లలోపు పిల్లలు చనిపోవడం ప్రారంభించారు. దీంతో వైరస్ కారణంగానే ఈ మరణాలు సంభవించాయని అప్పటి వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలో అప్పటి నుంచి ఈ వైరస్‌కు చాందీపూర్ వైరస్ అని పేరు పెట్టారు. ఆ తరువాత ఈ వైరస్ 2004 నుంచి 2006, 2019 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌లలో గుర్తించబడింది. చండీపురా వైరస్ అనేది ఆర్‌ఎన్‌ఏ వైరస్. ఇది ఎక్కువగా ఆడ ఫ్లెబోటోమైన్ ఫ్లై ద్వారా వ్యాపిస్తుంది. దోమలలో కనిపించే ఈడిస్ దోమ దీని వ్యాప్తికి కారణం. జూన్ 2024 ప్రారంభం నుంచి గుజరాత్‌లో 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ కేసులు నమోదయ్యాయి.
చాందీపురా వైరస్ లక్షణాలు
చాందీపురా వైరస్ కారణంగా రోగికి జ్వరం, విరేచనాల లక్షణాలు కనిపిస్తాయి. ఫ్లూ వంటి లక్షణాలతోపాటు తీవ్రమైన మెదడువాపు వ్యాధిని కలిగి ఉంటారు. ఈ వైరస్ దోమలు, ఈగలు, కీటకాల ద్వారా వ్యాపిస్తుంది. అనేక రకాల వైరస్‌లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, రసాయనాలు/టాక్సిన్‌లు మొదలైన వాటి వల్ల ఎఇఎస్ ఏర్పడుతుంది.