ఠాణే : మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా నవీముంబై లోని ఓ పాఠశాలలో 16 మంది విద్యార్థులు కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. కరోనా సోకిన విద్యార్దులందర్నీ స్థానిక కొవిడ్ కేర్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. వైరస్ బారిన పడిన విద్యార్ధులంతా 8 నుంచి 11 తరగతులు చదువుతున్నవారేనని నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఘన్సోలీలోని గోతివలిలో ఉన్న షెట్కారి శిక్షణ్ సంస్థ పాఠశాలలో కొవిడ్ బారినపడిన 11 వ తరగతి విద్యార్థి తండ్రి ఈనెల 9న ఖతార్ నుంచి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. అయితే అతడికి నెగెటివ్ వచ్చినప్పటికీ కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయగా, విద్యార్థుల్లో వైరస్ వెలుగు చూసినట్టు పేర్కొన్నారు.
దీంతో అప్రమత్తమైన అధికారులు పాఠశాల లోని విద్యార్దులందరికీ కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు విద్యార్ధులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించిన అధికారులు శనివారం మరో 600 మంది పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం కొవిడ్ బారిన పడిన ఈ 16 మంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు ప్రస్తుతం మహారాష్ట్రలో కొవిడ్ క్రియాశీల కేసులు 10,582 ఉన్నాయి. అలాగే ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్రలో ఇప్పటివరకు 40 నమోదైన విషయం తెలిసిందే.