మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. ఆరు రోజులే ప్రచారానికి గడువు ఉండటంతో అభ్యర్థులు రాత్రింబవళ్లు ప్రచారంలో మునిగిపోయారు. ఈసారి విజయం సాధిం చే లక్షంతో బరిలో నిలిచిన నేతలు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ విజయ బావుటా ఎగురవేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అందులో భాగంగా ఈసారి ఎన్నికల్లో నాన్నల పేరు మీద టికెట్లు సంపాదించుకున్న యువ అభ్యర్థులు తండ్రుల ఫోటోలతో జపం చేస్తూ ప్రచార రథాలపై పరుగులు పెడుతూ గతంలో వారు నియోజకవర్గంలో చేసిన అభివృద్ది, పేదలకు ప్రభుత్వ పథకాలు అందించిన తీరును వివరిస్తున్నారు.
తన తండ్రి అడుగుజాడల్లో నడిచి పేదల పక్షాన పోరాటం చేస్తానని పేర్కొంటూ ఈఎన్నికల్లో తనను గట్టెక్కించాలని కోరుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల పోరులో కంటోన్మెంట్ నుంచి ప్రజా యుద్ద నౌక గద్దర్ కూతురు జి.వి.వెన్నెల కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. తన తండ్రి పేదల కోసం కాలుకు గజ్జెకట్టి పాట పాడుతూ ప్రజలను చైతన్యవంతం చేయడంలో కీలక పాత్ర పోషించి తన జీవితాన్ని ప్రజల కోసమే ఆర్పించాడని ఆమె ప్రచారంలో వివరిస్తున్నారు. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేసి బడుగు, బలహీనవర్గాల అభివృద్దికి పాటు పడతానని చెబుతున్నారు.
అదే నియోజకవర్గం నుంచి గ్రేటర్ హైదరాబాద్‌లో సీనియర్ నాయకుడు, ఐదుసార్లు అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన జి. సాయన్న కుమార్తె లాస్య నందిత బిఆర్‌ఎస్ నుంచి బరిలో నిలిచి తండ్రి నియోజకవర్గంలో చేసిన అభివృద్ది, సంక్షేమ పేరుతో ఓటర్ల వద్దకు వెళుతూ తనకు ఈఎన్నికల్లో మద్దతు ఇచ్చి అసెంబ్లీలో అడుగు పెట్టేలా దీవించాలని వేడుకుంటున్నారు. గతంలో కార్పొరేటర్‌గా పనిచేయడంతో కొద్దిగా రాజకీయ అనుభవం ఉండటంతో ఆమె ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
వీరితో పాటు హైదరాబాద్‌లో పేదల నాయకుడిగా పేరుపొందిన పి. జనార్దన్‌రెడ్డి(పిజెఆర్) కుమార్తె విజయారెడ్డి ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అదే నియోజకవర్గం నుంచి ఐదు పర్యాయాలు విజయం సాధి ంచిన పిజెఆర్ పేరు తెలియని వారు రాజధాని నగరంలో ఉండరు. ప్రస్తుతం ఆయన చేసిన పనులను ప్రజలకు వివరిస్తూ ఈసారి ప్రజలు తనను ఆదరించాలని విజయ అర్థిస్తున్నారు. నారాయణపేట నియోజకవర్గం నుంచి చిట్టెం పర్ణికారెడ్డి తన తాత నర్సిరెడ్డి, తండ్రి వెంకటేశ్వర్‌రెడ్డి చేసిన సేవలు ప్రజలకు చెబుతూ ఈ ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు.
ములుగు నియోజకవర్గం నుంచి బడే నాగజ్యోతి తన తండ్రి బడే నాగేశ్వర్‌రావు పేద ప్రజల కోసం పోరాట చేశారని, ఆయన ఆశయాలు నెరవేర్చేవిధంగా ప్రజలకు సేవలందిస్తానని పేర్కొంటూ ఎన్నికల్లో తనను దీవించాలని ప్రచారం చేస్తున్నారు. నాగార్జునసాగర్ నుంచి నోములు నర్సింహ్మయ్య తనయుడు నోముల భగత్‌కుమార్ కూడా రెండోసారి బరిలో ఉంటూ తన తండ్రి ప్రజలకు అందించిన విధంగా ప్రజాసేవ చేస్తానని ప్రచారం చేస్తూ తనను ప్రజ లు మరోసారి చట్ట సభకు పంపే అవకాశం కల్పించాలని దండాలు పెడుతున్నారు. ములుగు నుంచి బిజెపి తరుపున మాజీ మంత్రి చందులాల్ తనయుడు ఆజ్మీరా ప్రహ్లాద్ కూడా పోటీ చేస్తూ తన తండ్రి నియోజకవర్గం అభివృద్దికి పాటు పడ్డారని ఆయన బాటలో నడిచి పేదల కోసం నిరంతరం పాటు పడుతారని పేర్కొంటూ మొదటిసారి అసెంబ్లీ అడుగు పెట్టేలా చూడాలని కోరుతున్నారు.