మనతెలంగాణ/హైదరాబాద్: రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని రిటైర్డ్ ఎస్సై గుర్రం రాజమౌళి ఘరానా మోసం చేశాడని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన సాన అనిల్ కుమార్, కునబోయిన చంద్రశేఖర్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పలుమార్లు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడంలేదని, దీంతో హెచ్‌ఆర్సీని ఆశ్రయించామని బాధితులు పేర్కొన్నారు. అయినా ఈ విషయంలో ఇప్పటివరకు తమకు న్యాయం జరగలేదని వాపోయారు. 2016లో జగిత్యాల జిల్లాలో పనిచేస్తున్న ఎస్సై గుర్రం రాజమౌళి తమకు పరిచయం అయ్యారని తనకు రైల్వే శాఖలో తెలిసిన వారు ఉన్నారని, తమకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను ఇప్పిస్తానని తమకు నమ్మకం కలిగించారని వారు పేర్కొన్నారు.
ఉద్యోగం ఇప్పిస్తానని ఒక్కొక్కరి దగ్గర రాజమౌళి రూ.13 లక్షలు వసూలు చేశాడని, దీంతోపాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా తీసుకున్నాడని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తమకు ఉద్యోగం రాకపోగా, ఇటు డబ్బులు ఇవ్వకుండా తమను రాజమౌళి ఇబ్బంది పెడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు అడిగితే ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ రాజమౌళి బెదిరింపులకు గురి చేస్తున్నాడని వారు మీడియా ముందు వాపోయారు. తామే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 16 మంది బాధితులు ఉన్నారని వారు తెలిపారు.
16 unemployees filed complaint against Retired SI for Cheating