న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే దాదాపు 160 దేశీయ విమాన సర్వీస్‌లు రద్దు కానున్నాయని ఢిల్లీ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ ప్రతినిధి వెల్లడించారు. ఢిల్లీ నుంచి బయల్దేరే 80 విమానాలు, వచ్చే మరో 80 విమానాలు రానున్న మూడు రోజుల్లో రద్దయ్యే అవకాశం ఉందని చెప్పారు. జీ20 సదస్సు కారణంగా రానున్న మూడు రోజుల్లో విధించిన ట్రాఫిక్ నిబంధనలతో ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. ఈ సదస్సు కోసం ఎయిర్‌పోర్టులో అన్ని రకాల పరికరాలు, పార్కింగ్ సౌకర్యాలను సిద్ధంగా ఉంచామని వివరించారు.
“ ఇప్పటివరకు మా అంచనాల మేరకు మూడు రోజుల్లో రాకపోకలు సాగించే 160 దేశీయ విమానాలు రద్దవుతాయని భావిస్తున్నాం. సాధారణంగా ఎయిర్ పోర్టు నిర్వహించే దేశీయ సర్వీస్‌ల ఆపరేషన్లలో ఇవి 6 శాతానికి సమానం. ఆంక్షల కారణంగా అంతర్జాతీయ సర్వీసుల్లో ఎటువంటి ఇబ్బందులు లేవు. మేము ప్రయాణికుల అసౌకర్యాన్ని వీలైనంత తగ్గించేందుకు విమానయాన సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం ” అని ఢిల్లీ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ ప్రతినిధి పేర్కొన్నారు.
మరోవైపు విమానయాన సంస్థలు కూడా ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాయి. విస్తారా, ఎయిర్ ఇండియా, సంస్థలు తాము ఎంపిక చేసిన రీషెడ్యూల్ అయిన విమాన సర్వీసుల బుకింగ్స్‌ను వినియోగదారులు ఒకసారి మార్చుకొనేందుకు వీలుగా అదనపు ఛార్జీలను తొలగించాయి. ఈ విషయాన్ని ఎక్స్(ట్విటర్ ) వేదికగా ప్రకటించాయి. ఇక సెప్టెంబర్ 811 మధ్యలో విమాన ప్రయాణాల సమయంలో సర్వీస్‌ల స్టేటస్‌లను జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని విస్తారా సూచించింది. ఎయిర్ ఇండియా కూడా ప్రయాణాలను మార్చుకొన్న వినియోగదారులకు ఒక సారికి అదనపు ఛార్జీలను రద్దు చేసింది. మరోవైపు జీ 20 కారణంగా ఉన్న ట్రాఫిక్ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు తొందరగా బయల్దేరి విమానాశ్రయానికి చేరుకోవాలని స్పైస్‌జెట్ సూచించింది. చెక్‌ఇన్ కౌంటర్లను ప్రయాణానికి గంట ముందే మూసివేస్తామని వెల్లడించింది.