అయోధ్యలోని రామాలయానికి చెందిన 161 అడుగుల ఎత్తయిన శిఖర నిర్మాణం గురువారం ప్రారంభమైంది. నాలుగు నెలల్లో ఆలయ శిఖర నిర్మాణం పూర్తవుతుందని ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. రామాలయ శిఖర నిర్మాణం ప్రారంభం కావడంతో ఆలయ ప్రాంగణంలో ఏడుగురు రుషులకు చెందిన సప్త ఆలయాల నిర్మాణం కూడా ఊపందుకున్నట్లు మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న నాలుగు నెలల్లో ఈ సప్త ఆలయాల నిర్మాణం కూడా పూర్తయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
రామాలయ నిర్మాణంలో వేగాన్ని పెంచడం, కార్మికుల కొరత ఉన్న పక్షంలో వారి సంఖ్యను పెంచడం, సాంకేతిక బృందాన్ని ఎలా బలోపేతం చేయడం తదితర అంశాలను చర్చించేందుకు మూడు రోజుల సమీక్షా సమావేశం గురువారం నాడిక్కడ ప్రారంభమైనట్లు మిశ్రా చెప్పారు. సమావేశంలో పాల్గొనేందుకు మిశ్రా గురువారం ఉదయం అయోధ్య చేరుకున్నారు. కాగా..అయోధ్యలో రామాలయంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఈ ఏడాది జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో జరిగింది.