కాంగ్రెస్‌లో పార్లమెంట్ స్థానాల కోసం భారీగా ఆశావహుల దరఖాస్తు
మనతెలంగాణ/హైదరాబాద్: పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ ఆశావహుల నుంచి భారీగా స్పందన వస్తోంది. శనివారం ఒక్కరోజే 166 దరఖాస్తులు ఆశావహుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. శనివారం దరఖాస్తుల సమయం ముగిసే సరికి 17 పార్లమెంట్ నియోజక వర్గాలకు మొత్తం 306 దరఖాస్తులు అందాయని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఈ దరఖాస్తులకు సంబంధించి త్వరలోనే కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశమై అనంతరం వాటిని స్క్రూటీని చేయనుంది.
శనివారం ప్రముఖుల దరఖాస్తు
శనివారం దరఖాస్తులు చేసుకున్న వారిలో సికింద్రాబాద్ నుంచి కోదండ రెడ్డి దరఖాస్తు చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, హుడా చైర్మన్‌గా పనిచేసిన కోదండరెడ్డికి కాంగ్రెస్ పార్టీతో నాలుగు దశాబ్దాలుగా అనుబంధం ఉంది. ఇక భువనగిరి పార్లమెంట్ స్థానం కోసం గాంధీభవన్‌లో టిపిసిసి అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి అఖిలభారత సంఘటిత కార్మికుల ఉద్యోగుల కాంగ్రెస్ (కేకేసి) చైర్మన్ కౌశల్ సమీర్ దరఖాస్తు చేసుకున్నారు. కౌశల్ సమీర్ తరపున కాంగ్రెస్ మాజీ టిపిసిసి మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్ గాంధీభవన్‌లో దరఖాస్తును సమర్పించారు. ఇక వరంగల్ పార్లమెంట్ స్థానానికి పిడమర్తి రవి దరఖాస్తు చేసుకున్నారు.