న్యూఢిల్లీ : తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సిడిఎస్ రావత్ దంపతుల అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రోటోకాల్ ప్రకారం వారికి తుపాకీ వందనం (గన్ సెల్యూట్) సమర్పించారు. అంత్యక్రియల సందర్భంగా బిపిన్ రావత్‌కు 17 గన్ సెల్యూట్ సమర్పించారు. ఈ క్రమంలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. అసలు ఈ గన్ సెల్యూట్ ఎందుకు, ఎవరికి సమర్పిస్తారు. అనే ప్రశ్నలు మదిలోకి వస్తాయి. అంత్యక్రియలో సమయంలో తుపాకీ వందనం సమర్పించడం అంటే ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అర్థం. అయితే ఎవరికి ఈ గౌరవం లభిస్తుంది అంటే రాజకీయం, సాహిత్యం, న్యాయ, విజ్ఞాన, కళా రంగాల్లో విశిష్ట సేవ చేసిన వారికి తుపాకీ వందనం సమర్పిస్తారు. అలానే స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున కూడా గన్ సెల్యూట్ ఉంటుంది. దీంతో పాటు భారత సైన్యం యుద్ధ, శాంతి సమయాల్లో విశేష కృషి చేసిన వారికి సైనిక వందనం సమర్పిస్తోంది. ఫిరంగి వందనం కూడా సమర్పిస్తారు. భారత రాష్ట్రపతి, మిలిటరీ, సీనియర్ అధికారులు చనిపోయినప్పుడు 21 తుపాకీ వందనాలు సమర్పిస్తారు.
త్రివిధ దళాలలో పని చేసిన ఉన్నతాధికారులు మరణిస్తే 17 తుపాకీ వందనాలు సమర్పిస్తారు. గతంలో మోడీ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన గౌరవార్ధం ఢాకాలో 19 తుపాకీ వందనాలు సమర్పించారు. మాజీ రాష్ట్రపతులు, ప్రధాని, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సీఎంలు మరణించినప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి.. తుపాకీ వందనం సమర్పిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తే దేశవ్యాప్తంగా సంతాప దినాలు ప్రకటించడం, జాతీయ జెండాను అవనతం చేయడం, దేశం అంతటా సెలవు ప్రకటిస్తారు. భారతదేశంలో తొలిసారిగా మహాత్మా గాంధీకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అప్పటి వరకు దీనికి సంబందించి ఎలాంటి నియమ నింబధనలు రూపొందించలేదు. బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి భారతదేశం 21 తుపాకీ వందన సంప్రదాయాన్ని వారసత్వంగా పొందింది. స్వాతంత్య్రానికి ముందు అత్యధికంగా 101 తుపాకీ వందనం ఉండేది. దీనిని రాయల్ సెల్యూట్ అని పిలుస్తారు.