నైజీరియాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ స్కూల్ లో భారీ అగ్ని ప్రమాదం జరగడంతో.. 17 మంది విద్యార్థులు సజీవదహనమయ్యారు. వివరాల్లోకి వెళితే..జంఫారా రాష్ట్రంలో కైరా నమోదా జిల్లాలోని ఓ ఇస్లామిక్ స్కూల్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 17 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఘటన సమయంలో బడిలో 100 మంది విద్యార్థులు ఉన్నట్లు జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ తెలిపింది.
ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయడగా.. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా పాఠశాల పక్కనే నిల్వ ఉంచిన కర్రలకు మంటలు అంటుకుని ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు బాధితుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పాఠశాలలను కోరారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.