ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో 17 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో9 మంది తలలపై రూ. 24 లక్షల రివార్డు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. సీఆర్‌పిఎఫ్ పోలీస్‌ల ఎదుట లొంగిపోయిన వారిలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు దినేష్ మొడియం (36), అతడి భార్య జ్యోతి తాటి అలియాస్ కళా మొడియం (32) ఉన్నట్టు తెలిపారు. దినేష్ తలపై రూ. 8 లక్షలు, జ్యోతి పై రూ. 5 లక్షల వంతున రివార్డు ఉన్నట్టు బీజాపూర్ సీనియర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. అలాగే ఏరియా కమిటీ సభ్యులు దుడ్ల కరంపై రూ. 5 లక్షలు, మరో ఆరుగురిపై రూ. లక్ష చొప్పున రివార్డు ఉందన్నారు. వీరందరూ గంగలూరు ఏరియా కమిటీలో వివిధ హోదాల్లో చురుకుగా ఉన్నవారేనని చెప్పారు.
వీరి లొంగుబాటు వెనుక డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డు, బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ , సీఆర్‌పీఎఫ్, కోబ్రా దళాలు కీలకపాత్ర పోషించినట్టు ఎస్పీ వివరించారు. సైద్ధాంతిక లోపాలు, అమాయక గిరిజనుల పట్ల కొందరు సీనియర్లు దోపిడీకి పాల్పడటం, వంటి చర్యలతో కలత చెందడం, భద్రతా బలగాల ప్రభావం పెరిగిన నేపథ్యంలో వీరంతా లొంగిపోయినట్టు బీజాపూర్ సీనియర్ ఎస్పీ తెలిపారు. అలాగే గ్రామాల్లో అభివృద్ధి కోసం తాము చేపట్టిన నియా నెల్లనార్ (యువర్ గుడ్ విలేజ్ ) అనే పథకం పట్ల ఆకర్షితులయ్యారన్నారు. లొంగిపోయిన వారికి రూ.25 వేలు చొప్పున సహాయం అందించామని, ప్రధాన స్రవంతి లోకి చేర్చేందుకు ప్రభుత్వ విధానం ప్రకారం వారికి పునరావాసం కల్పించనున్నట్టు పేర్కొన్నారు. గత ఏడాది బస్తర్‌లో 792 మంది మావోయిస్టులు లొంగిపోగా, ఈ ఏడాదిలోఇప్పటివరకు బీజాపూర్ జిల్లాలో 65 మంది లొంగిపోయారు.