హైదరాబాద్: కొడుకు హత్య ఏ విధంగా జరిగిందో తనకు పూర్తిగా తెలియదని, తాను పోలీసులను నిందించదల్చుకోలేదని, అయితే ఓ వ్యక్తి తన కొడుకు ప్రాణాలను తీశాడని నహెల్ తల్లి మౌనియా ఫ్రాన్స్ 5 టీవీకి ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. తన కొడుకు ప్రాణాలు తీసింది 38 సంవత్సరాల అధికారి అని ఆమె ఆరోపించారు. మంగళవారం రాత్రి ఆ అధికారి దారుణంగా వ్యవహరించాడని, తన కొడుకును తనకు దూరం చేశాడని తెలిపారు. తన కొడుకు కారులో వెళ్లుతుండగా తనిఖీలకు ఆపుతున్న దశలో ఈ అధికారి కాల్చివేసినట్లు తెలిపారు. తన కొడుకు అరబ్ లాగా ఉండటం వల్లనే చంపిఉంటాడని ఆరోపించారు. తనకు పూర్తిస్థాయి న్యాయం దక్కాల్సి ఉందన్నారు.
పోలీసు అధికారి కానీ ఏ ఇతరులు కానీ మా పిల్లలపై గన్‌తో దాడికి దిగి ప్రాణాలు తీసే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. కాగా నాహేల్ నానమ్మ ఓ అల్జీరియా టీవీ ఎన్నాహర్ టీవీ ఛానల్‌తో మాట్లాడారు. తమ కుటుంబ పూర్వపు మూలాలు అల్జీరియాతో ఉన్నాయని, ఫ్రాన్స్‌లో ఉన్నామని తెలిపారు. తమ దేశ సంతతి మూలాలున్న టీనేజర్ అంతం పట్ల అల్జీరియాలో విషాదం నెలకొంది. తమ దేశ ప్రజలంతా సంఘీభావం వ్యక్తం చేశారని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. పోలీసులు తరచూ వర్ణవివక్షతకు దిగుతున్నారని, ఇతర తెగలపై జులుం సాగిస్తున్నారని పలు ఫిర్యాదులు అందాయి. యాంటి రేసిజమ్ ఉద్యమకారులు ఇప్పుడు తీవ్రస్థాయిలో నిరసనలకు దిగారు.