టెక్ మహీంద్ర యూనివర్సిలో కరోనా కలకలం
హైదరాబాద్: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 38,731 కరోనా పరీక్షలు నిర్వహించగా, 171 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఒక్క గ్రేటర్ హైదరాబాదు పరిధిలోనే 75 కొత్త కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో 15, కరీంనగర్ జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 167 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,75,319 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,67,798 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,534 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,987కి పెరిగింది.
టెక్ మహీంద్ర యూనివర్సిలో కరోనా కలకలం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బహదూర్‌పల్లిలోని టెక్ మహీంద్ర యూనివర్సిటీలో కరోనా కలకలం రేపింది. టెక్ మహీంద్రా యూనివర్సిటీలో 25 మంది విద్యార్థులకు, ఐదు మంది టీచర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మిగతా విద్యార్థులు, టీచర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మొదట ఇద్దరు విద్యార్థులకు జ్వరం రావడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే.. టెక్ మహేంద్ర యూనివర్సిటీ మొత్తంగా 25 మంది విద్యార్థులకు , 5 మంది భోదన సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్టు చెబుతున్నారు. కాగా ఈ విషయాన్ని మేడ్చల్ జిల్లా ఉప వైద్యాధికారి కూడా ధృవీకరించారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. మిగతా విద్యార్థులు, టీచర్లు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని యూనివర్సిటీ యాజమాన్యం సూచించింది. వర్సిటీ ప్రాంగణంలో శానిటైజేషన్ చేసి తరగతులు నిర్వహిస్తామని వర్సిటీ ప్రతినిధులు వెల్లడించారు. కరోనా భయంతో విద్యార్థులు వసతి గృహం ఖాళీ చేశారు.