న్యూఢిల్లీ : దేశంలో కరోనా కు సంబంధించి మంగళవారం 4.64 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయగా, 17,135 మందికి పాజిటివ్ అని తేలింది. ముందు రోజు కంటే నాలుగు వేల మేరకు అదనంగా కేసులొచ్చాయి. పాజిటివిటీ రేటు 3. 69 శాతానికి చేరిందని బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, వంటి రాష్ట్రాల్లో ఒక్కోచోట వెయ్యికి పైగా కేసులు వెలుగు చూశాయి. 24 గంటల వ్యవధిలో 19,823 మంది కోలుకున్నారు. మరో రోజు కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. ప్రస్తుతం క్రియాశీల కేసులు 1.37 లక్షలకు తగ్గగా, ఆ కేసుల రేటు 0.31 శాతంగా నమోదైంది. ఇప్పటివరకు 4.40 కోట్ల మందికి పైగా కరోనా బారిన పడగా, అందులో 98.49 శాతం వైరస్ నుంచి కోలుకున్నారు. మంగళవారం 47 మంది మరణించారు. గత 24 గంటల్లో 23.49 లక్షల మంది టీకా తీసుకున్నారు. ఇప్పటివరకు 93.36 కోట్ల మంది రెండో డోసు తీసుకోగా, 9.47 కోట్ల మంది ప్రికాషనరీ డోసు వేయించుకున్నారు. దాంతో మొత్తంగా గత ఏడాది ప్రారంభం నుంచి 204.84 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది.