న్యూఢిల్లీ: గత అయిదేళ్లలో 1,761 మంది లోకో పైలట్లు(రైలు డ్రైవర్లు) బ్రీత్ అనలైజర్ టెస్టులో విఫలమయ్యారని, వీరిపై నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం రాజ్యసభకు తెలియజేశారు. సురక్షితమైన రైలు ఆపరేషన్ల కోసం లోకో డ్రైవర్లందరినీ సంబంధిత లాబీల్లో బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయించుకోవలసిందిగా కోరడమైనదని మంత్రి ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు. గత అయిదేళ్ల కాలంలో మొత్తం 8,28,03, 387 బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించగా, 1,761 మంది లోకో పైలట్లు ఈ పరీక్షల్లో విఫలమయ్యారు. వీరిలో 674 మంది ప్యాసింజర్ రైలు డ్రైవర్లు ఉండగా, 1,087 మంది గూడ్సు ఇంజన్ డ్రైవర్లున్నారని ఆయన తెలిపారు.
మద్యం సేవించి ఉన్నారేమో తెలుసుకోవడం కోసం జరిపే ఈ పరీక్షలో విఫలమయిన డ్రైవర్లను రైళ్లు నడపడానికి అనుమతించలేదని, వీరిపై నిబంధనల ప్రకారం తగు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. జోన్ల వారీగా చూస్తే మొత్తం 16 జోన్లు ఉండగా ఉత్తర రైల్వే జోన్‌లో అత్యధికంగా లోకోపైలట్లు టెస్టులో విఫలమయ్యారని ఆయన తెలిపారు. ఈ జోన్‌లో గత అయిదేళ్లలో మొత్తం 521 మంది డ్రైవర్లు ఈ పరీక్షలో ఫెయిలయినట్లు ఆయన తెలిపారు. ఆ తర్వాత 287 మంది డ్రైవర్లతో పశ్చిమ రైల్వే జోన్ రెండో స్థానంలో ఉందని ఆయన చెప్పారు.