సోదాలు కొనసాగుతున్నాయి : జిఎస్‌టి అధికారులు
న్యూఢిల్లీ: సుగంధ ద్రవ్యాల వ్యాపారి పీయూష్‌జైన్ నుంచి ఇప్పటివరకు రూ.177.45 కోట్ల అక్రమ నగదు, 23కిలోల బంగారం, 600 కిలోల గంధం చెక్కల నూనెను(రూ.6 కోట్ల విలువైంది) జిఎస్‌టి అధికారులు జప్తు చేశారని కేంద్ర ఆర్థికశాఖ సోమవారం వెల్లడించింది. అహ్మదాబాద్‌లోని జిఎస్‌టి నిఘా విభాగం డైరెక్టరేట్ జనరల్ ఆధ్వర్యంలో జైన్ నివాసాలు, కార్యాలయాలపై ఈ నెల 22నుంచి సోదాలు జరుగుతున్నాయి. మొదట కాన్పూర్‌లోని ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు ప్రారంభమయ్యాయి.
ఆ తర్వాత కనౌజ్‌లోనూ సోదాలు నిర్వహించారు. ఈ నెల 25న జైన్ నుంచి వాంగ్మూలాన్ని జిఎస్‌టి అధికారులు రికార్డు చేశారు. ఈ నెల 26న జైన్‌ని అరెస్ట్ చేశారు. జిఎస్‌టి అధికారులు సోదాలు నిర్వహించిన సంస్థల్లో జైన్‌కు చెందిన శిఖార్ బ్రాండ్ పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తుల కంపెనీ, గణపతి రోడ్ క్యారియర్స్ ఉన్నాయి. కనౌజ్‌లో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని జిఎస్‌టి అధికారులు తెలిపారు. జైన్‌కు సమాజ్‌వాదీపార్టీతో సన్నిహిత సంబంధాలున్నాయని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. త్వరలో యుపిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే ఈ దాడులన్న విమర్శలు వస్తున్నాయి.