రాయికల్‌ః మేత కోసం ఊరు దాటిన గేదెలను ఎస్సారెస్పీ కెనాలు మృత్యువు రూపంలో కాటేసిన సంఘటన రాయికల్ మండలం అయోధ్య గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 250 దాక ఉన్న బర్ల మంద గ్రామశివారులోకి మేత కోసం వెళ్లాయి. మధ్యాహ్నం నీటి కోసం కాల్వలోకి దిగిన 18 గేదెలు నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కాల్వలో కొట్టుకుపోయి ఊపిరాడక మృతి చెందాయి. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పశువుల మందను కాపరి మేత కోసం తీసుకెళ్లగా ప్రతి రోజు మధ్యాహ్నం అవి కాల్వలోనే దప్పిక తీర్చుకుంటాయి.
ప్రతి రోజు లాగే ఈ రోజు మధ్యాహ్నం నీరు తాగేందుకు కాల్వలోకి వెళ్లగా కాల్వలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండి గేదెలు ప్రమాదవశాత్తు అందులో పడి కొట్టుకుపోయాయి. గేదెల మృతితో బాధిత రైతులు కన్నీటి పర్యంతమైయ్యారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ స్థానిక ప్రజాప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ఆదేశాలతో రాయికల్ ఎంపిపి లావుడ్యా సంధ్యారాణి, జెడ్పిటిసి జాదవ్ ఆశ్విని, జగిత్యాల ఆర్డీఓ మాధురి, తహసీల్దార్ కుందారపు మహేశ్వర్‌లు సంఘటన స్థలానికి చేరుకొని పూర్తి వివరాలు సేకరించారు. బాధిత రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
18 buffaloes fell into canal and died in Raikal