సైబర్ నేరాలు చేస్తున్న 18మంది వ్యక్తులను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.5 లక్షల నగదు, 26 మొబైల్ ఫోన్లు, 16 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…మహారాష్ట్రకు చెందిన నికేష్ భాటి, సంజయ్ బిమాన్ దాస్, రాజస్థాన్, అజ్మీర్‌కు చెందిన యోగేష్‌కుమార్, దేవరాజ్ చంద్రావత్ అలియాస్ నాను, సన్నీ అలియాస్ రోహన్ యాదవ్, మహారాష్ట్రకు చెందిన అమీర్ కాశీనాథ్ జాదవ్, ముంబాయికి చెందిన ఎండి ఆరిఫ్ బర్కాట్ అలీ షేక్, నాగపూర్‌కు చెందిన సాకేత్ సతీష్ టెంబుర్‌నే, అన్నా గోకుల్ ధాగే, ముంబాయికి చెందిన అజయ్ గోపీనాథ్ మిశ్రా అలిస్ కేశవ్ కుమార్ అలియాస్ కపూర్, బెంగళూరుకు చెందిన రాధీ బేడి, శ్రీధర్, ఉదయ్‌కుమార్, వరుణ్‌కుమార్, కౌషిక్, రాజస్థాన్, భరత్‌పూర్‌కు చెందిన సమీన్ ఖాన్ అలియాస్ షామిన్‌ఖాన్, షేకుల్ ఖాన్ మివాటి అలియాస్ షైకూల్ ఖాన్ కలిసి సైబర్ నేరాలు చేస్తున్నారు.
ఇందులో ముగ్గురు నిందితులు సైబర్ నేరాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో ఆరు పెట్టుబడుల మోసాలు, ఒక డిజిటల్ మోసం, సెక్స్‌టార్షన్, ఓటిపి, ఇన్సూరెన్స్ మోసం నేరాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిందితులపై 45 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రానికి చెందిన పలువురిని మోసం చేసి రూ.6,94,09,661 కొట్టేశారు. దేశవ్యాప్తంగా నిందితులపై 319 కేసులు ఉన్నాయి. నిందితుల బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.1,61,25,876కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వరుసగా సైబర్ నేరాలు జరగడంతో నిందితులపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు దృష్టి సారించారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు టీంలను ఏర్పాటు చేశారు. ఈ టీములు నిందితులను పట్టుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఆపరేషన్ చేపట్టారు. ఆరు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టారు. 18 మంది సైబర్ నేరగాళ్లను ఆరెస్టు చేశారు. నిందితులు దేశవ్యాప్తంగా సెక్స్ టార్షన్, కొరియర్, పెట్టుబడి పేరుతో వీరు మోసాలకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు.