అంత్యక్రియలకు వెళ్లి అనంతలోకాలకు యుపిలో ఘోర విషాదం
22 మందికి గాయాలు, శిథిలాల కింద మరికొంత మంది?
రంగంలో ఎన్‌డిఆర్‌ఎఫ్, భారీ వర్షంలో దారుణ ఘటన
గజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి అంత్యక్రియలకు వచ్చిన 18 మంది శ్మశానవాటికలో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. 24 మంది వరకూ గాయపడ్డారు. రాష్ట్రంలోని మురాద్‌నగర్‌లో ఆదివారం ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతానికి చెందిన రామ్‌ధన్‌కు అంత్యక్రియలు నిర్వహిస్తుండగా బంధువులు అక్కడికి వచ్చారు. ఉన్నట్లుండి భారీ వర్షం కురియడంతో పలువురు అక్కడ ఘాట్ కాంప్లెక్‌సలోని ఓ నిర్మాణంలో ఉన్న భవనం కింద తలదాచుకున్నారు. పై కప్పు కూలడంతో కింద ఉన్న వారిలో 15 మంది శిథిలాల కింద కూరుకునిపోయి ఊపిరాడక మృతి చెందారు. గంటల తరువాత అక్కడికి సహాయక బృందాలు చేరుకుని శిథిలాలను తొలిగించే పనిలో పడ్డాయి. శిథిలాల కింద మరికొందరు బాధితులు ఉండి ఉంటారని భావిస్తున్నామని గజియాబాద్ రూరల్ ఎస్‌పి ఇరాజ్ రాజా తెలిపారు. పలువురిని ఆసుపత్రికి తరలించారు.
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌డిఆర్‌ఎఫ్) దళం ఈ శ్మశానవాటికకు చేరుకుంది. పెద్ద ఎత్తున సహాయక చర్యలకు దిగింది. ఈ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జరిగిన ఘటనపై తనకు పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని మీరట్ స్థానిక అధికారులను సిఎం ఆదేశించారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ తదితర ప్రాంతాలలో ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. పలు చోట్ల దట్టమైన పొగమంచు అలుముకుంది.
18 died after roof collapsed at Ghaziabad Cremation