Sunday, December 22, 2024

ఖాట్మండులో కూలిన ప్రైవేట్ విమానం

- Advertisement -
- Advertisement -

ప్రైవేట్ నేపాల్ విమాన సంస్థ విమానం బుధవారం ఖాట్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో కూలిపోయి మంటల్లో చిక్కుకున్నది. విమానంలోని 19 మందిలో ఒక విదేశీయునితో సహా 18 మంది ఈ దుర్ఘటనలో మరణించారు. పైలట్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన దేశీయ విమానం ఎన్9ఎఎంఇ మామూలు మరమ్మతుల కోసం పోఖారా వెళుతుండగా ఉదయం 11.11 గంటలకు ఈ ప్రమాదానికి లోనైంది. బొంబార్డియర్ సిఆర్‌జె 200 జెట్ విమానం ‘రన్‌వే నుంచి జారి భారీ మంటల్లో చిక్కుకుంది’ అని నేపాల్ పౌర విమానయాన ప్రాధికార సంస్థ (సివిఎఎన్) అన్వేషణ, సహాయక కేంద్రం ఒక ప్రకటనలో తెలియజేసింది.

విమానం మంటలు, పొగలో చిక్కుకోవడం వీడియోల్లో కనిపించింది. ఫైరింజన్లు, అంబులెన్స్‌లు వెంటనే ప్రమాద స్థలానికి వెళ్లాయి. 15 మంది అక్కడికక్కడే మరణించారని, ముగ్గురు ఒక స్థానిక ఆసుపత్రిలో చికిత్స సమయంలో మృతి చెందారని అధికారులు తెలిపారు. మృతుల్లో ఒక సహ పైలట్, 17 మంది శౌర్య ఎయిర్‌లైన్స్ ఉద్యోగులు ఉన్నారు, వారిలో ఒక నేపాలీ మహిళ, ఒక యెమెనీ జాతీయుడు ఉన్నారు. పైలట్ కెప్టెన్ మనీష్ శాక్య ఖాట్మాండు మోడల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం తరువాత ఖాట్మాండు విమానాశ్రయంలో విమాన సర్వీసులను కొద్దిసేపు నిలిపివేసి, ఆ తరువాత పునరుద్ధరించినట్లు విమానాశ్రయ అధికారులు తెలియజేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News