Tuesday, January 21, 2025

మహారాష్ట్ర ఆసుపత్రిలో మరణ దారుణాలు

- Advertisement -
- Advertisement -

థానే : స్థానిక కల్వాలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రిలో గడిచిన 24 గంటల వ్యవధిలో 18 మంది రోగులు మృతి చెందారు. ఈ విషయాన్ని పురపాలక సంస్థ కమిషనర్ అభిజిత్ బంగారు ఆదివారం తెలిపారు. చికిత్సల దశలోనే ఈ విధంగా రోగులు పిట్టలుగా రాలిపోతూ ఉండటం కలవరానికి దారితీసింది. కారణాలను తెలుసుకునేందుకు ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసినట్లు అభిజిత్ తెలిపారు. మృతులలో 12 మంది 50 ఏండ్లు దాటిన వారు ఉన్నారు. కాగా మొత్తం పది మంది మహిళలు, ఎనమండుగురు పురుషులు చనిపోయినట్లు వెల్లడైంది. మృతులలో ఆరుగురు థానేకు చెందిన వారు ఉన్నారు. నలుగురు కల్యాణ్ వారు, ముగ్గురు సహాపూర్ వారు , భివాండీ, ఉల్హాస్‌నగర్, ముంబైలోని గొవండికి చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు. మరో వ్యక్తి వేరే చోటుకు చెందిన వారు మరొకరిని గుర్తించలేదు. అంతకు ముందు ఈ మరణాలకు సంబంధించి రాష్ట్ర ఆరోగ్య మంత్రి తానాజీ సావంత్ , స్థానిక డిసిప గణేష్ గవ్డేలు కూడా విలేకరులకు తెలిపారు.

వీరు 17 మంది చనిపోయినట్లు వివరించారు. ఆసుపత్రిలో మరణాల గురించి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సమాచారం తీసుకున్నారని కమిషనర్ బంగారు చెప్పారు. మరణాలకు కారణాలపై ఆరాతీసేందుకు స్వతంత్ర దర్యాప్తు కమిటీ ఏర్పాటుకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ కమిటీకి ఆరోగ్య సేవల కమిషనర్ సారధ్యం వహిస్తారు. మరణాల కారణాలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక అందిస్తారు. రోగులలో ఎక్కువ మందికి కిడ్నీ స్టోన్ల సమస్యలు, పక్షవాతం, న్యూమోనియా, కిరోసిన్ పాయిజనింగ్, సెప్టిసిమియా వంటి సమస్యలు ఉన్నాయి. చికిత్సల దశలో వీరు మృతి చెందారు. చికిత్సల పద్ధతులను ముందుగా పరిశీలిస్తారు. మృతుల సమీప బంధువుల నుంచి కూడా వీరి సమస్యల గురించి ప్రకటనలను తీసుకుని రికార్డు చేసుకుంటారు. ఆసుపత్రి అధికారుల నిర్లక్షం వల్లనే ఈ విధంగా రోగులు మృతి చెందుతున్నారని ఎన్‌సిపి నేత శరద్ పవార్ విమర్శించారు. ముందుగా ఒక్కరోజునే ఐదుగురు చనిపోయినప్పుడు సరిగ్గా స్పందించకపోవడం పరిస్థితిని విషమింపచేసిందని స్పందించారు. రాష్ట్ర మంత్రి అదితి తత్కారే ఆసుపత్రిని సందర్శించారు. పరిస్థితిని పర్యవేక్షించారు. ఇకపై ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News