1,60,000 స్లాట్‌లు
1,52,926 రిజిస్ట్రేషన్‌లు
5,105 నాలా దరఖాస్తులకు పరిష్కారం
రూ. 100 కోట్లకు పైగా రాబడి
అరగంటలో మ్యుటేషన్, రిజిస్ట్రేషన్‌లు
2 నుంచి 8 నిమిషాల్లో నాలా కన్వర్షన్ పూర్తి
సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ధరణి ఫోర్టల్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 1,52,926 రిజిస్ట్రేషన్‌లు, 1,60,000 స్లాట్‌లతో సుమారు రూ. 100 కోట్లకు పైగా రాబడి ప్రభుత్వానికి సమకూరింది. ధరణి ఫోర్టల్ ప్రారంభమై ఇప్పటికే 100 రోజులు దాటింది. ఇప్పటికే 18 రకాల సేవలను ధరణి పోర్టల్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. తహసీల్దార్ కార్యాలయానికి రైతులు వచ్చిన అరగంటలోనే రిజిస్ట్రేషన్‌లు పూర్తవుతుండడంతో మిగిలిన సేవలన్నీ ఒక్కొక్కటిగా ధరణి వెబ్‌సైట్‌లో అధికారులు చేర్చారు. వీటితో పాటు తప్పుల సవరణకు సంబంధించి సైతం సులభతరం విధానాన్ని తైరపైకి తీసుకొచ్చారు. ఎన్‌ఆర్‌ఐ ఫోర్టల్ నుంచి డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ నుంచి జిపిఏ దాకా పలు సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు నాలాకు సంబంధించి 5,550 దరఖాస్తులు రాగా అందులో 5105 నాలా దరఖాస్తులకు తహసీల్దార్‌లు పరిష్కారం చూపారు.
కమిటీ నియామకం
గతేడాది అక్టోబర్ 29వ తేదీన సిఎం కెసిఆర్ చేతుల మీదుగా మూడుచింతపల్లిలో ధరణి వెబ్‌సైట్ ప్రారంభమైంది. మొదట్లో ఇబ్బందులు ఎదురైనా వాటిని మెల్లమెల్లగా దాటుకొని ముందుకెళుతోంది. ఇప్పటికీ గ్రీవెన్‌సెల్‌కు వచ్చిన ఫిర్యాదులతో పాటు పలు సమస్యలను సిసిఎల్‌ఏ అధికారులతో ఓ కమిటీ సైతం ప్రభుత్వం నియమించింది. ధరణిలో తలెత్తే సమస్యలకు త్వర లో ఆ కమిటీ పరిష్కారం చూపనుంది. ప్రస్తుతం ధరణి సేవలు విస్తృతమయ్యాయి. ప్రతి సమస్యకు ఒక ఆప్షన్‌ను ఇచ్చారు. ప్రస్తుతం ధరణిలో 18 రకాల ఆప్షన్లకు అవకాశం కల్పించగా అందులో అన్ని రకాల భూ సమస్యలను ఉన్నతాధికారులకు నివేదించేలా అవకాశం కల్పించారు. ధరణి వచ్చినప్పటి నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌లు సులభతరంగా మారాయి. క్రయ, విక్రయదారులు సిటీజన్ లాగిన్ ద్వారా స్లాట్‌ను బుక్ చేసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌లకు పావుగంట నుంచి అరగంట సమయం పడుతుండగా నాలా కన్వర్షన్ 2 నుంచి 8 నిమిషాల్లో పూర్తవుతుంది.
ఇటీవల ఇచ్చిన ఆప్షన్లు
అప్లికేషన్ ఫర్ లాండ్ మ్యాటర్స్, సరిహద్దు వివాదాల విస్తీర్ణం తప్పుగా నమోదు కావడం, అటవీ సరిహద్దు వివాదాలు, పట్టాదారు పాసు పుస్తకం మంజూరు కాకపోవడం తదితర సమస్యల కోసం దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించారు. ఆధార్‌కార్డు లేక ఇబ్బంది పడుతున్న ఎన్నారైలు తమ పాస్‌పోర్టు నంబర్ లేదా ఓవర్సీస్ సిటీజన్ ఆఫ్ ఇండియా (ఓసిఐ) కార్డు నెంబర్‌తో భూముల వివరాలను ధరణిలో నమో దు చేసుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. అప్లికేషన్ ఫర్ మిస్సింగ్ సర్వే ఎక్స్‌టెంట్ గతంతో పోల్చితే కొత్త పట్టాదారు పాసు పుస్తకాల్లో విస్తీర్ణం తక్కువగా నమోదైన వారు దరఖాస్తు చేసుకునేలా అవకాశం.
డిఏజిపిఏ కింద డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ కమ్ జిపిఏను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈ ఆప్షన్‌ను తీసుకొచ్చారు. పాసు పుస్తకాలకు ఆధార్ అనుసంధానం కాకపోవడం, కంపెనీలు/సంస్థల భూములకు పాసు పుస్తకాలు లేక ఇబ్బంది పడుతున్న వారి సమస్యకు పరిష్కారంగా మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించారు.