Friday, November 22, 2024

18 రాష్ట్రాల సిఎస్‌లు, ఆర్థిక కార్యదర్శులు సుప్రీంలో హాజరు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: న్యాయాధికారుల వేతనం, పింఛన్ బకాయిలు, రిటైర్‌మెంట్ ప్రయోజనాల చెల్లింపుపై రెండవ జాతీయ జ్యుడీషియల్ వేతన కమిషన్ (ఎస్‌ఎన్‌జెపిసి) సిఫార్సులను తాము అమలు చేసిందీ లేనిదీ వివరించేందుకు అరుదైన దృశ్యంగా 18 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు (సిఎస్‌లు), ఆర్థిక శాఖ కార్యదర్శులు మంగళవారం సుప్రీం కోర్టు ముందు హాజరయ్యారు. భవిష్యత్తులో వ్యక్తిగత హాజరు నుంచి తమను మినహాయించాలని అత్యున్నత స్థాయి ప్రభుత్వ అధికారులు విజ్ఞప్తి చేయగా కోర్టు అంగీకరించింది.

మాజీ న్యాయమూర్తులు, న్యాయాధికారుల కోసం సంక్షేమ, ఇతర కార్యక్రమాల అమలుపై అఖిల భారత న్యాయమూర్తుల సంఘం (ఎఐజెఎ) పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం విచారిస్తున్నది. ‘రాష్ట్రాల సిఎస్‌లు, ఆర్థిక శాఖ కార్యదర్శులను పిలవడం మాకు ఏ మాత్రం సంతోషకరం కాదు. కానీ, రాష్ట్రాల న్యాయవాదులు అదే పనిగా విచారణల సమయంలో గైర్‌హాజరవుతున్నారు’ అని ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పర్దీవాలా, మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఎస్‌సి తీర్పు, ఆదేశాలను రాష్ట్రం పాటించిందని పశ్చిమ బెంగాల్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది చెప్పినప్పుడు బెంచ్ ఆ వ్యాఖ్య చేసింది. ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, మధ్య ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, అస్సాం, నాగాలాండ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, ఝార్ఖండ్, కేరళ, బీహార్, గోవా, హర్యానా, ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు. ఆర్థిక శాఖ కార్యదర్శులు సిజెఐ కోర్టు గదిలో హాజరయ్యారు. వారు తమ న్యాయవాదులకు సాయంచేస్తూ కనిపించారు. సుప్రీం ఆదేశాలను తాము గణనీయంగా పాటించామని, వర్చువల్‌గా హాజరయ్యేందుకు తమను అనుమతించాలని అంటూ తమ న్యాయవాదుల ద్వారా చెప్పించి కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కాకుండా తప్పించుకునేందుకు కొందరు సిఎస్‌లు ఈ నెల 22 వరకు ప్రయత్నించారు.

అయితే,. బెంచ్ వెనుకకు తగ్గలేదు. కొంత మంది అధికారుల కోసం మినహాయింపు ఇవ్వజాలమని బెంచ్ స్పష్టం చేసింది. ‘చెప్పుకోదగిన అమలు నాకు కనిపించలేదు. వారు మా ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలి లేదా మేము వారిపై నాన్‌బెయిలబుల్ వారంట్లు (ఎన్‌బిడబ్లు)జారీ చేస్తాం’ అని సిజెఐ 22న హెచ్చరించారు. జనవరి 4 నాటి తమ తీర్పును. పూర్వపు ఆదేశాలను 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పాటించడం పట్ల బెంచ్ మంగళవారం సంతృప్తి వ్యక్తంచేసి, విచారణను ముగించింది. అగ్రశ్రేణి అధికారులు ఇక మీదట వ్యక్తిగతంగా హాజరుకానవసరం లేదని బెంచ్ తెలిపింది. కొన్ని రాష్ట్రాల విషయంలో వాటి సంబంధిత ఆర్థిక శాఖ అధికారులు న్యాయాధికారుల వేతనం, పింఛన్, భత్యాలకు సంబంధించిన బకాయిల క్లెయిములను నాలుగు వారాల్లోగా పరిష్కరించవలసి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.

ఈ వ్యవహారంలో అమికస్ క్యూరీగా బెంచ్‌కు సాయపడుతున్న సీనియర్ న్యాయవాది కె పరమేశ్వర్ ఆదిలో మాట్లాడుతూ, మధ్య ప్రదేశ్, తమిళనాడు, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ వంటి కొన్ని రాష్ట్రాలు కోర్టు ఆదేశాలను పాటించాయని తెలియజేశారు. ఈ విషయాన్ని బెంచ్ ముగిస్తూ, న్యాయాధికారుల వ్యక్తిగత ఫిర్యాదులను ఇందు కోసం ఏర్పాటైన హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ ఇక పరిశీలించగలదని చెప్పింది. వేతన విధానం, పింఛన్, కుటుంబ పింఛన్, భత్యాలకు సంబంధించినవి ఎస్‌ఎన్‌జెపిసి సిఫార్సులు. జిల్లా న్యాయవ్యవస్థ పని పరిస్థితుల నిర్ధారణకు ఒక శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కూడా కమిషన్ సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News