హైదరాబాద్ : బిజెపి పాలనలో ఏది కొనాలన్నా అగ్గిలో చేయిపెట్టనట్టు ఉన్నదని బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండి కాలనీ రామ్‌లీలా మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కవిత, మంత్రులు గంగుల కమలాకర్ , సత్యవతిరాథోడ్ హాజరయ్యారు. ఎల్‌ఎండీ కాలనీలో అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు. అనంతరం ర్యాలీగా రామ్ లీలా మైదానానికి బయలుదేరి ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవితకు స్థానికులు గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.
అనంతరం కవిత మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా పెరుగు, పాలు, నెయ్యి మీద పన్నులు విధించలేదని, కానీ పాలు, పెరుగు, నెయ్యి మీద బిజెపి ప్రభుత్వం పన్నులు వేస్తోందని విమర్శించారు. మార్కెట్ కి పోయి ఏదైనా కొనాలని చూస్తే అగ్గిల చెయ్యి పెట్టే పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు. ఈ రోజు ఏది కొన్ని పరిస్థితి లేదని అన్నారు. కందిపప్పు, నూనెలతో పాటు ఇతర నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు. సిలిండర్ ధరలు చూస్తే మళ్ళీ కట్టెల పొయ్యి పెట్టుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సిఎం కెసిఆర్ ప్రభుత్వం అన్నిటిపై సబ్సిడీలు ఇచ్చి ప్రజలపై భారాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. కాబట్టి మన కోసం ఎవరు పనిచేస్తున్నారన్న విషయాన్ని ప్రజలు ఆలోచించుకోవాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.
* మహిళా సంఘాలకు రూ.18 వేల కోట్ల రుణాలు పంపిణీ..
మహిళా సంఘాలకు దేశంలో ఎక్కడాలేని విధంగా రుణాలు ఇస్తున్నామని, మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న 54 లక్షల మంది మహిళలకు ఏడాది రూ. 18 వేల కోట్ల రూపాయలు రుణాలు పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ప్రతి గ్రామంలో మహిళా సంఘాల వ్యాపారం చేసుకోవడానికి రూ. 20 లక్షలు కెసిఆర్ ప్రభుత్వం అందిస్తున్నదని పేర్కొన్నారు. వడ్డీ లేని రుణాలు, అభయ హస్తం నిధులు త్వరలోనే విడుదలవుతాయని ప్రకటించారు. విఎఓల సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు.
‘అమ్మ లేకపోతే ఆడబిడ్డ లేకపోతే ఒక్కరోజు కాదు ఒక గంట కూడా ఇల్లు గడవదు. ఉదయాన్నే లేచి ఇల్లు చక్కదిద్దుతారు. ఇప్పుడు మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు లభిస్తున్నాయి. అవకాశాలను అందిపుచ్చుకునే ఆత్మస్థైర్యం ఆడబిడ్డలకు రావాలి.‘ అని అన్నారు. రూ. 8 వేల కోట్లతో ప్రతి పాఠశాలలో బాత్ రూం లను కెసిఆర్ ప్రభుత్వం దశలవారీగా నిర్మిస్తుందని వివరించారు. ఎస్‌సి, బిసి మహిళా విద్యార్థుల కోసం డిగ్రీ కాలేజ్ హాస్టల్లు నిర్మించిన ఘనత సిఎం కెసిఆర్‌కు దక్కుతుందని అన్నారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ అందిస్తున్నారని చెప్పారు.
* మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు..
పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా ఇతర శాఖలలో కూడా రిజర్వేషన్లను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. చదువుకుంటే ప్రభుత్వంతోపాటు ప్రైవేటు ఉద్యోగాల్లో అవకాశాలు లభిస్తాయని అన్నారు. ప్రభుత్వం దాదాపు రెండున్నర లక్షల ఉద్యోగాలు కల్పించిందని గుర్తు చేశారు. ఆడపిల్లల చదువు విషయంలో రాజీ పడవద్దని విజ్ఞప్తి చేశారు.
ఆస్తులు ఇవాళ ఉంటే రేపు పోవచ్చు కానీ చదువు జీవితాంతం తోడుగా ఉంటుందని స్పష్టం చేశారు. చిన్నప్పుడు తన తల్లి పట్టుబట్టి తనను చదివించిందని, అందు వల్లనే ఈ రోజు ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానని తెలిపారు. ఎంత కష్టమైనా ఎంతవరకైనా ఆడబిడ్డను చదివించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.