యెమెన్, జిబౌటి జలాల్లో ఆఫ్రికా నుంచి వలసదారులతో ప్రయాణిస్తున్న నాలుగు పడవలు రాత్రిపూట బోల్తా పడ్డాయని ఐక్యరాజ్యసమితి వలస సంస్థ శుక్రవారం తెలిపింది. కనీసం ఇద్దరు మరణించగా, 186 మంది గల్లంతయ్యారని వెల్లడించింది. యెమెన్ తీరంలో గురువారం రాత్రి రెండు పడవలు బోల్తా పడ్డాయని అంతర్జాతీయ వలస సంస్థ ప్రతినిధి తమీమ్ ఎలియన్ తెలిపారు. ఇద్దరు నౌకా సిబ్బందిని రక్షించగా, 181 మంది వలసదారులు, ఐదుగురు యెమెన్ సిబ్బంది కనిపించకుండా పోయారని ఆయన అసోసియేటెడ్ ప్రెస్‌కు తెలిపారు.
అదే సమయంలో ఆఫ్రికాలోని జిబౌటి దేశం నుండి బయలుదేరిన మరి రెండు బోల్తా పడ్డాయని, వలసదారుల రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు, పడవలోని మిగతా వారిని రక్షించినట్లు ఆయన తెలిపారు. దాదాపు దశాబ్ద కాలంగా అంతర్యుద్ధం కొనసాగుతున్నందున తూర్పు ఆఫ్రికా నుంచి వలస దారులు యెమెన్ మార్గం గుండా గల్ఫ్ దేశాలకు వెళ్లి పనిచేసుకుని బతకాలని ప్రాణాలకు సైతం తెగించి సాహసం చేస్తున్నారు. కానీ వారిలో కొందరికి ప్రమాదాలు తప్పడం లేదు. ప్రస్తుతం యెమెన్‌లో 380000 మంది వలసదారులు ఉన్నారు.