పెరిగిన నష్టాలతో కష్టాల్లో చిప్ తయారీ కంపెనీ
ఖర్చులను 20 బిలియన్ డాలర్లు తగ్గించుకోనున్నట్టు ప్రకటన
న్యూయార్క్ : నష్టాలు వస్తున్న కారణంగా అమెరికన్ చిప్ మేకర్ ఇంటెల్ తన మొత్తం సిబ్బందిలో భారీగా కోతలకు సిద్ధమైంది. కంపెనీలో సుమారు 15 శాతం మంది ఉద్యోగులను, అంటే 18 వేల మంది ఉద్యోగులను తొలగించనుంది. ప్రస్తుతం కంపెనీలో 1,24,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంటెల్ తన ఖర్చులను 20 బిలియన్ డాలర్లు తగ్గించుకోనుంది.
ఇటీవల త్రైమాసికంలో కంపెనీ సుమారు 1.6 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. కంపెనీ సిఇఒ పాట్ గెల్సింగర్ మాట్లాడుతూ, కంపెనీ కీలక ఉత్పత్తులు, సాంకేతికతలో మైలురాళ్లను సాధించినప్పటికీ రెండో త్రైమాసికంలో పనితీరు చాలా పేలవంగా ఉందని అన్నారు. సెకండాఫ్ ట్రెండ్‌లు గత అంచనాల కంటే చాలా సవాలుగా ఉన్నాయి. ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా సంస్థ లాభాలను మెరుగుపరచడానికి, బ్యాలెన్స్ షీట్‌ను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ డేవిడ్ అన్నారు.
నష్టాల కారణంగా ఇజ్రాయెల్‌లో పెట్టుబడి నిలిపివేత
ఇంటెల్ ఇజ్రాయెల్‌లో ఒక పెద్ద ఫ్యాక్టరీ ప్రాజెక్ట్‌ను కూడా నిలిపివేసినట్లు జూన్‌లో ప్రకటించింది. ఇజ్రాయెల్‌లో చిప్ ప్లాంట్ కోసం అదనంగా 15 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టాలని కంపెనీ యోచిస్తోంది. ఇంటెల్ దాని ప్రత్యర్థి కంపెనీలైన ఎన్విడియా, ఎఎమ్‌డి, క్వాల్‌కామ్ నుండి కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. దశాబ్దాలుగా ల్యాప్‌టాప్‌ల నుండి డేటా సెంటర్‌ల వరకు ప్రతిదానిలో ఉపయోగించే చిప్‌ల మార్కెట్‌లో ఇంటెల్ ఆధిపత్యం చెలాయించింది. అయితే ఇటీవలి సంవత్సరాలలో ఎన్విడియా వంటి కంపెనీలు ఎఐ రంగంలో ముందుకు సాగాయి.