Thursday, January 23, 2025

హృద్యంగా, హుందాగా సభ

- Advertisement -
- Advertisement -

సరికొత్త పార్లమెంటు భవనంలో 18వ లోక్ సభ తొలిసారిగా కొలువుదీరింది. నేషనల్ డమోక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) మూడోసారి అధికార పగ్గాలను చేపట్టి ట్రెజరీ బెంచీల్లో ఆశీనులైంది. ఒక కాంగ్రెసేతర కూటమి వరుసగా మూడో దఫా అధికారంలోకి రావడం స్వతంత్ర భారతావనిలో ఇదే మొదటిసారి. అంతేకాదు, జవహర్ లాల్ నెహ్రూ తర్వాత సుదీర్ఘకాలం ప్రధాని పదవిని చేపట్టిన ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుంది. ఈసారి లోక్ సభకు జరిగిన ఎన్నికలకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది.. ప్రతిపక్షానికి చెప్పుకోదగినన్ని సీట్లు రావడం.

గత పదేళ్లుగా లోక్ సభలో విపక్షాలకు బలం అంతంతమాత్రమే కావడంతో అనేక సందర్భాల్లో అధికారపక్షానిదే పైచేయి అయింది. సమగ్రంగా చర్చించి, ఆమోదించవలసిన కీలకమైన బిల్లులను సైతం సంఖ్యాబలంతో అధికారపక్షం ఇట్టే అమోదింపజేసుకోవడం జరిగింది. ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 234 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా అవతరించడంతో అధికార కూటమి ఏకపక్ష విధానాలకు అడ్డుకట్ట పడినట్లేనని చెప్పుకోవాలి. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి 544 సభ్యులతో లోక్ సభ సమావేశాలు జరగడం ఇదే చివరిసారి కావచ్చు కూడా.

లోక్ సభ కొలువు దీరడానికి ముందు ప్రధాని మోడీ విలేఖరులతో మాట్లాడుతూ సభ్యులందరినీ కలుపుకుని వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకుంటామనడం ముదావహమే అయినా ఇదే విలేఖరుల భేటీలో ఆయన విపక్షాలపై విమర్శలు సంధించడాన్ని బట్టి చూస్తే కలుపుకుపోయే ప్రక్రియ ఆచరణలో ఎంతవరకూ సాధ్యమవుతుందనేది అనుమానమే. సామాన్య పౌరుల ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతిపక్షాలు నడుచుకుంటాయని ప్రధాని ఆశించడం సబబే. అయితే విపక్షాలు కూడా అధికారపార్టీనుంచి ఇదే ఆశిస్తాయనే విషయాన్ని ఎన్డీఏ సభ్యులు మరచిపోకూడదు. ప్రజాసమస్యల పరిష్కారంలోనూ, కట్టుదిట్టమైన చట్టాల రూపకల్పనలోనూ అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య సయోధ్య ఎంతవరకూ ఉంటుందో చూడాలి. ఆదిలోనే హంసపాదులా ప్రొటెం స్పీకర్ ఎంపికలోనే సభ్యుల మధ్య వివాదం చెలరేగడం కొత్త లోక్ సభకు శుభసూచకం కాదు. ఏ పార్టీకి చెందినవారనే సంగతిని పక్కనబెట్టి, లోక్ సభలో సీనియర్ నేతను ప్రోటెం స్పీకర్ గా ఎంపిక చేయడం సాంప్రదాయంగా వస్తుండగా, మహతాబ్ ను ఆ పదవిలో కూర్చోబెట్టడంతో విపక్షాలు భగ్గుమన్నాయి.

ఎనిమిదిసార్లు లోక్ సభకు ప్రాతినిథ్యం వహించిన కాంగ్రెస్ సభ్యుడు కె. సురేశ్ ను కాదనడం విమర్శలకు దారితీసింది. దరిమిలా, సభా సాంప్రదాయాలను పాటించవలసిన ఉభయపక్షాల మధ్య స్పీకర్ ఎన్నికలోనే అభిప్రాయభేదాలు పొడసూపే పరిస్థితి ఏర్పడింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచీ లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నిక ఏకగ్రీవంగా జరుగుతోంది. డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించడం కూడా అంతే ఆనవాయితీగా వస్తోంది. గత లోక్ సభలో ఈ పదవిని ఖాళీగా ఉంచడం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం సాంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చిందన్న విమర్శలు వినవచ్చిన నేపథ్యంలో ఈసారైనా ఈ పదవిని విపక్షాలకు కేటాయించడం ద్వారా అధికారపక్షం హుందాగా వ్యవహరించాలి. 2004-2014 మధ్య కాలంలో రెండుసార్లు ప్రభుత్వాన్ని నడిపిన యుపిఎ.. డిప్యూటీ స్పీకర్ పదవిని బిజెపికి కేటాయించిన సంగతిని అధికార పక్షం సభ్యులు గుర్తెరిగి మసలుకోవాలి. కొత్త లోక్ సభలో చర్చించవలసిన అంశాలు ఎన్నో ఉన్నాయి.

వాటిలో తాజాగా చెలరేగుతున్న నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ ఒకటి. నేర న్యాయాలపై నూతన చట్టాల అమలు విషయం రెండవది. మణిపూర్ లో హింసాకాండ, జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల దాడులు వంటి అంశాలు లోక్ సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆకాశాన్నంటుతున్న నిత్యావసర సరకులు, కూరగాయల ధరలు, అగ్నిపథ్ పథకం వంటివి కూడా ప్రస్తావనకు రావచ్చు. సభామర్యాదను కాపాడుతూ, అంశాలవారీగా చర్చలు జరిపి పరిష్కారం కనుగొనేందుకు కృషి చేయవలసిన బాధ్యత ఇరుపక్షాలపైనా ఉంది. పంతాలు పట్టుదలలకు పోయి, ఒకరిపై ఒకరు దూషణలకు పాల్పడి సభాసమయాన్ని వృథా చేయడంవల్ల అంతిమంగా నష్టపోయేది ప్రజలే. ఈ వాస్తవాన్ని గుర్తెరిగి బాధ్యతతో మసలుకుని, పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రతిష్ఠను సభ్యులు ఇనుమడింపజేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News