లేబర్‌ను రక్షించే దశలో పోలీసులకు గాయాలు
పాల్ఘార్ : మహారాష్ట్రలోని పాల్ఘార్‌లో ఉన్న స్టీల్‌ప్లాంట్‌లో ఓ గుంపు కార్మికులపై దాడికి దిగింది. వారిని అడ్డుకునేందుకు యత్నించిన దశలో పోలీసులపై కూడా దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటనలో 19 మంది పోలీసులు గాయపడ్డారు. 12 వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ విషయాన్ని అధికారులు ఆదివారం తెలిపారు. కంపెనీ ఉద్యోగులపై కార్మికసంఘానికి చెందిన వారుగా అనుమానిస్తున్న వంద మంది వరకూ వచ్చి దాడికి దిగారు. వీరు ఫ్యాక్టరీ గేటు తీసుకుని లోపలికి దూసుకువచ్చారు. అక్కడి కార్మికులు ఉద్యోగులను కొట్టారు. ఆవరణలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పోలీసు బలగాలు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకునేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. పైగా కార్మిక సంఘాల వారి చేతుల్లోనే పోలీసులు దెబ్బలు తిని గాయాల పాలుకావల్సి వచ్చింది. ఘటన తరువాత ఇప్పటికి పోలీసులు 27 మందిని అరెస్టు చేశారు. ఆవరణలో భారీ బందోబస్తు ఏర్పాటు అయింది. పోలీసు పికెట్‌ను నెలకొల్పారు. కంపెనీలో ఓ విషయంపై చాలాకాలంగా వివాదం సాగుతోంది. ఈ క్రమంలోనే ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు. అసలు వివాదం ఏమిటనేది అధికారులు తెలియచేయలేదు.