భువనేశ్వర్ : ఒడిశా డెంకనల్ జిల్లా మెరమండలి వద్దనున్న టాటా స్టీల్ కర్మాగారంలో మంగళవారం స్టీమ్ లీకై 19 మంది గాయపడ్డారు. గాయపడిన వారందర్నీ కటక్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి వెంటనే తరలించినట్టు పోలీస్‌లు చెప్పారు. స్టీమ్ లీకైన తరువాత ప్రమాదం జరిగిందని, బ్లాస్ట్‌ఫర్నేస్‌ను పరిశీలిస్తున్న కార్మికులు , ఇంజినీర్లు గాయపడ్డారని డెంకనల్ ఎస్‌పి గ్యానరంజన్ మొహాపాత్ర వివరించారు. టాటాస్టీల్ అధికార ప్రతినిధి మాత్రం 17 మందికి కాలిన గాయాలయ్యాయని, వీరిలో ఒకరి పరిస్థితి క్లిష్టంగా ఉందని పేర్కొన్నారు.
కర్మాగారంలో తనిఖీ చేస్తున్న సమయంలో మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ప్రమాదం జరిగిందని అక్కడ ఉన్న కొద్దిమందికి గాయాలయ్యాయని టాటాస్టీల్ ఒక ప్రకటనలో తెలియజేసింది. అయితే గాయపడిన వారిని తక్షణం ముందు జాగ్రత్తగా పరిశ్రమ ఆవరణ లోనే ఉన్న ఆక్యుపేషనల్ హెల్త్ సెంటర్‌కు తరలించామని, అక్కడ నుంచి తదుపరి చికిత్స కోసం కటక్‌కు కంపెనీ అంబులెన్స్‌లో డాక్టర్, పారమెడికల్ సిబ్బంది సాయంతో పంపడమైందని ప్రకటనలో వివరించారు. అత్యవసర నిబంధనలతో సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలపై అంతర్గత విచారణ సాగిస్తున్నామని కంపెనీ పేర్కొంది.