అనేక పట్టణాలు జలమయం
కార్లు కొట్టుకు పోయాయి.. భవనాలు కూలాయి
రిజర్వాయర్లు ఉప్పొంగడంతో లోతట్టు గ్రామాలు ఖాళీ
బెర్లిన్ : జర్మనీలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాలతో వరద ప్రళయం ముంచుకొచ్చి 19 మంది మృతి చెందగా, అధిక సంఖ్యలో గల్లంతయ్యారు. వాగులు పొంగి వరదలై వీధుల్లో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కార్లు తుడిచిపెట్టుకు పోతున్నాయి. భవనాలు కూలుతున్నాయి. యూస్కర్‌చిన్ లోని పశ్చిమకౌంటీలో వరదల ముప్పుతో గురువారం ఎనిమిది మంది చనిపోయారని, సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అహ్రవెయిలర్ కౌంటీలో నలుగురు చనిపోయారు. ఇళ్ల పైకప్పుల్లో దాదాపు 50 మంది ఇరుక్కున్నారు. స్కల్డ్ గ్రామంలో గత రాత్రి ఆరిళ్లు కూలిపోయాయి. తూర్పు బెల్జియంలో గత రాత్రంతా ఎడతెరిపి లేని వర్షాలతో కొన్ని పట్టణాలు జలమయమయ్యాయి. ఒకరు వరదలో మునిగి చనిపోగా, మరొకరు గల్లంతయ్యారు. అనేక గ్రామాల్లో మోకాలి లోతు నీళ్లుండడం, రహదార్లు జలమయం కావడం, రాకపోకలు బంద్ కావడం, కొండచరియలు విరిగి పడడంతో ఎంతమంది గల్లంతయ్యారో, ఎంతమంది మృతి చెందారో ఇంకా తెలియడం లేదని అధికారులు పేర్కొన్నారు.
పశ్చిమ, మధ్య జర్మనీ ప్రాంతాల్లోనూ, పొరుగున ఉన్న రాష్ట్రాల్లోనూ విపరీతమైన నష్టం జరిగింది. కొలొగ్నె, కామెన్, వుప్పెర్టల్ ప్రాంతాల్లో వేర్వేరు సంఘటనల్లో నలుగురు చనిపోయారు. రైన్ సియాగ్ కౌంటీలో స్టెయిన్ బచ్టల్ రిజర్వాయర్ గండి పడే ప్రమాదం ఉండడంతో దిగువ నున్న గ్రామాలను ఖాళీ చేయించారు. అల్టెనా నగరంలో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా బుధవారం ఫైర్‌మేన్ వరద నీటిలో మునిగిపోయాడు. వెర్ధోలి పవర్ ప్లాంట్ వద్ద మరొకరు చనిపోయారు. వరదలో మునిగిపోయిన తన ఆస్తిని రక్షించుకునే ప్రయత్నంలో జోష్టడిట్ పట్టణంలో ఒకరు గల్లంతయ్యారు. బుధవారం లింబర్గ్ ప్రావిన్స్‌కు 70 సైనిక దళాలను డచ్ ప్రభుత్వం సహాయ కార్యక్రమాల కోసం పంపింది. లక్సెంబర్గ్ వద్ద రైలు మార్గం దెబ్బతింది.
19 killed in Germany as heavy rains