Saturday, November 23, 2024

టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ కేసులో మరో 19మంది అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో సోమవారం మరో 19 మందిని సిట్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఇప్పటికే 74 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితులు విచారణలో ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో 19 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో త్వరలో మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకోసం సిట్ ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయితే టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో హైటెక్ పద్ధతిలో మాస్ కాపీయింగ్ చేయించి అరెస్ట్ అయిన పోల రమేష్‌కు నిందితులకు సంబంధాలున్నట్లు సమాచారం. అసిస్టెంట్ ఇంజనీర్‌ను పేపర్‌ను 30 మందికి విక్రయించిన పోల రమేష్ వద్దనుంచి సేకరించిన సమాచారంతో పేపర్ కొనుగోలు చేసిన నిందితులను సిట్ అధికారులు అరెస్ట్ చేస్తూ వస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఇటీవల మున్సిపల్ ఎఇ పరీక్షలో 16వ ర్యాంకు సాధించిన నాగరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన నాగరాజు ప్రభుత్వ ఉద్యోగి రమేష్ నుంచి పేపర్ కొనుగోలు చేసి పరీక్ష రాసి ర్యాంకు సాధించినట్లు గుర్తించారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 85కు చేరుకుంది.

ఈ ఏడాది మార్చి మాసంలో టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ అంశం వెలుగు చూసింది. తొలుత టిఎస్‌పిఎస్‌సి కార్యాలయంలో కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయని భావించారు. కానీ టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ అయిందని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ కేసు దర్యాప్తును సిట్‌కు ప్రభుత్వం అప్పగించింది. తొలుత బేగంపేట పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేశారు. ఎఆర్ శ్రీనివాస్ నేతృత్వంలోని సిట్ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కారణంగా గతంలో నిర్వహించిన పరీక్షలను వాయిదా వేశారు. మరికొన్ని పరీక్షలను రద్దు చేశారు. వాయిదా పడిన, రద్దు చేసిన పరీక్షలను టిఎస్‌పిఎస్‌సి తిరిగి నిర్వహిస్తుంది. గ్రూప్-1, గ్రూప్-4 పరీక్షలను కూడ ఇటీవలనే టిఎస్‌పిఎస్‌సి నిర్వహించింది.

ఈ ఏడాది జూన్ 9వ తేదీన ఈ కేసుకు సంబంధించి సిట్ కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసింది. రూ. 1.63 కోట్లు ఈ కుంభకోణంలో చేతులు మారినట్టుగా చార్జీషీట్‌లో సిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇడికి ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు ఇడి అధికారులు కూడ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని ఇడి ప్రశ్నించింది. జైల్లో ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి సహా పలువురిని ఇడి ప్రశ్నించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News