Thursday, January 23, 2025

కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్న 19 పార్టీలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ , లోక్‌సభ స్పీకర్ ఓం బిరా మే 28న ప్రారంభించనున్న నూతన పార్లమెంట్ భవనం రాజకీయ వివాదంలో చిక్కుకుంది. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి పార్లమెంట్‌లో అంతర్భాగమైన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవడంపై కాంగ్రెస్‌తోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక..నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని హిందూత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్ జయంతి నాడు నిర్ణయించడంపై కూడా ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

ఇది బిజెపి, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధానికి దారితీసింది. కాగా..నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తూ లోక్‌సభ సచివాలయ కార్యదర్శి ఆహ్వాన పత్రం పంపగా ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు టిఎంసి అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అందరికన్నా ముందు ప్రకటించారు.
టిఎంసి ఎంపి డెరెక్ ఓబ్రియన్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ&పార్లమెంట్ అనేది కేవలం ఒక కొత్త భవనం కాదని, పురాతన సంప్రదాయాలు, విలువలు, నియనిబంధనలతో కూడిన వ్యవస్థని అన్నారు. అది భారత ప్రజాస్వమ్య పునదిలాంటిదని, ప్రధాని మోడీకి ఇవేవీ పట్టవని ఆయన విమర్శించారు. తాను, తన పార్ట సహచరులు ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని ఓబ్రియన్ తెలిపారు.

ఇక అక్కడినుంచి ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటిస్తున్న ప్రతిపక్ష పార్టీల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటివరకు బహిష్కరణ నిర్ణయాన్ని ప్రకటించిన పార్టీలలో..కాంగ్రెస్, టిఎంసి, డిఎంకె, జనతాదళ్(యునైటెడ్), ఆప్, ఎన్‌సిపి, శివసేన(యుబిటి), సిపిఎం, సమాజ్‌వాది పార్టీ, ఆర్‌జెడి, సిపిఐ, ఐయుఎంఎల్, జెఎంఎం, నేషనల్ కాన్ఫరెన్స్, కేరళ కాంగ్రెస్(మణి), ఆర్‌ఎస్‌పి, విడుదలై చిరుతైగల్ కట్చి, ముమలర్చి ద్రవిడ మున్నేట్ర కళగం, రాష్ట్రీయ లోక్ దళ్ ఉన్నాయి. మే 28న జరిగే నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు మొత్తం 19 పార్టీలు ఇప్పటివరకు ప్రకటించాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News