సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న 19ఏళ్ల యువతిపై తన అనుచరులతో కలిసి సెక్యూరిటీ సూపర్ వైజర్ గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లో చోటుచేసుకుంది. బాధితురాలు ఉద్యోగం కోసం ఝార్ఖండ్ లోని తన సొంత ఊరు నుంచి ఇటీవల ఘజియాబాద్ లోని తన బంధువుల ఇంటికి వచ్చింది. అక్కడే ఓ హౌసింగ్ సొసైటిలో సెక్యూరిటి గార్డు ఉద్యోగంలో చేరింది. ఈ క్రమంలో ఆదివారం విధుల్లో ఉన్న బాధితురాలిని సెక్యూరిటి సూపర్ వైజర్ తన ఇద్దరు అనుచరులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిని బాధితురాలిని తోటి ఉద్యోగులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో బాధితురాలి కజిన్, మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు. అనంతరం అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్యాంగ్ రేప్ అనంతరం బలవంతంగా విషం కలిపిన కూల్ డ్రింక్ ను తాగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లి బాధితురాలి పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలు క్రిటికల్ కండీషన్ లో ఉండడంతో మెజిస్ట్రేట్ ను ఆస్పత్రికి పిలిపించి ఆమె స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు.అయితే, బాధితురాలు చికిత్స పొందుతూ సోమవారం మరణించింది. ఈ ఘటనలో నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.