Thursday, January 23, 2025

19 ఏళ్ల యువకుడు.. రోజూ అర్థరాత్రి 10 కిమీ పరుగు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ సమీపం లోని నోయిడాలో అర్ధరాత్రి 12 గంటలకు ఓ 19 ఏళ్ల యువకుడు భుజానికి బ్యాగ్ తగిలించుకుని రోడ్డుపై వేగంగా పరుగెడుతూ వెళ్తున్నాడు. అటుగా వెళ్తున్న బాలీవుడ్ దర్శకుడు వినోద్ కాప్రి ఆ యువకుడిని చూసి… అయ్యో ఏదో సమస్యలో ఉన్నట్టున్నావ్.. లిఫ్ట్ ఇవ్వనా అని అడిగాడు. కానీ ఆ యువకుడు సున్నితంగా తిరస్కరించాడు. ఎందుకని అడిగితే అతడు చెప్పిన సమాధానం … ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారడమే కాక, ఎంతో మందిలో స్ఫూర్తి రగిలిస్తోంది. ఇంతకీ ఎవరా యువకుడు… ? ఎందుకలా పరుగెడుతున్నాడు ?
ఉత్తరాఖండ్‌కు చెందిన 19 ఏళ్ల ప్రదీప్ మెహ్రాది నిరుపేద కుటుంబం నోయిడాలో తన సోదరుడితో కలిసి ఉంటూ స్థానికంగా మెక్ డోనాల్డ్‌లో పనిచేస్తున్నాడు. తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తను పనిచేసే స్టోర్ నుంచి ఇంటికి 10 కిలోమీటర్ల దూరం. రోజూ విధులు ముగించుకున్న తర్వాత అర్థరాత్రి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తాడు. శనివారం అర్థరాత్రి అలా పరుగెడుతూ వెళ్తోన్న ప్రదీప్ …. దర్శకుడు వినోద్ కాప్రి కంటపడ్డాడు. వినోద్ కారును స్లో చేసి లిఫ్ట్ ఇస్తానని చెప్పాడు. దానికి ఆ యువకుడు తనకు లిఫ్ట్ వద్దని రోజూ ఇలాగే పరిగెడుతానని అన్నాడు. దీంతో ఆశ్చర్యపడిన వినోద్.. అతడి గురించి మరింత తెలుసుకోవాలనుకున్నాడు. వారి మధ్య సంభాషణ సాగిందిలా…
వినోద్ : ఓ బాబు ఎక్కడికెళ్లాలి… నేను డ్రాప్ చేస్తాను రా ?
ప్రదీప్ : వద్దు… నేను పరిగెత్తుకుంటూనే ఇంటికెళ్తాను.
వినోద్ : నువ్వు ఎందుకు అలా పరిగెడుతున్నావ్ ?
ప్రదీప్ : నేను రోజూ ఇలాగే ఇంటికి వెళ్తాను
వినోద్ : ఎక్కడ పనిచేస్తావ్ ?
ప్రదీప్ : మెక్ డోనాల్డ్
వినోద్ : రా.. నా కారులో డ్రాప్ చేస్తాను.
ప్రదీప్ : వద్దు. నాకు మళ్లీ పరిగెత్తేందుకు టైం దొరకదు.
వినోద్: ఎందుకు ఇలా పరిగెడుతున్నావ్?
ప్రదీప్ : ఆర్మీలో చేరేందుకు ప్రాక్టీస్ చేస్తున్నా
వినోద్ : ఉదయమే రన్నింగ్ చేయొచ్చు కదా
ప్రదీప్ : ఉదయాన్నే నేను లేచి వంట చేసుకుని పనికెళ్లాలి. అప్పుడు టైం ఉండదు.
వినోద్ : ఈ వీడియో వైరల్ అయితే ఎలా ?
ప్రదీప్ : నన్నెవరు గుర్తుపడతారు. వైరల్ అయినా ఓకే… నేనేం తప్పు చేయట్లేదు కదా.
వినోద్ : రా.. మనిద్దరం కలిసి డిన్నర్ చేద్దాం
ప్రదీప్ : లేదు. ఇంట్లో అన్న ఉన్నాడు. నేను వెళ్లి ఇద్దరికీ వంట చేయాలి. లేదంటే తను తినడు.
వినోద్ : మీ అన్న వంట చేసుకోలేడా ?
ప్రదీప్ : అతనికి నైట్ షిఫ్ట్ వర్క్ ఉంది.
వినోద్ : సరే… ఈ రోజుకు మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రా.
ప్రదీప్ : వద్దు . నేను రోజూ ఇలాగే వెళ్తా. ఈరోజు మీతో వస్తే నా ప్రాక్టీస్‌కు ఆటంకం కలుగుతుంది.
వినోద్ కాప్రి తన కార్లో కూర్చుని ఆ యువకుడితో సాగించిన సంభాషణ ఇది. అతడు చెప్పిన సమాధానం దర్శకుడిని ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీడియోను వినోద్ ఆదివారం సాయంత్రం తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ప్రదీప్ ఓ అద్భుతమైన వ్యక్తి అని, అతడి కథ ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని రాసుకొచ్చారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే విపరీతంగా వైరల్ అయ్యింది. కేవలం 12 గంటల్లోనే దాదాపు 4 లక్షల మంది ఈ వీడియోను చూశాను . మనదేశ భవిష్యత్తు ఇలాంటి అద్భుతమైన యువతరం చేతుల్లో ఉందంటూ పలువురు నెటిజన్లు ప్రదీప్‌ను కొనియాడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News