Sunday, December 22, 2024

చరిత్ర యాదిలో వరద విలయతాండవం… కళ్ల ముందే ఆ గ్రామం జలసమాధి

- Advertisement -
- Advertisement -

ఈరోజు గుర్తొస్తేనే గ్రామస్తుల గుండెల్లో దడ
వరదల ఉధృతం.. వైరా ఏరు ఉగ్రరూపం
42 మందిని కోల్పోయిన నక్కలగరుబు గ్రామం
ప్రాణాలు దక్కించుకున్న పలువురి గత జ్ఞాపకాలు

మన తెలంగాణ/మధిర: మే 19 సాయంత్రం 5:00 కావస్తుందంటే అదేదో ఆందోళన, అప్పటి గుండె దడ  ఇప్పటికి భయంకరంగా ఆ గ్రామ ప్రజలకు గుర్తుకు వస్తోంది. ప్రతి ఏడాది ఈ రోజు వచ్చిందంటే చాలు ఆ గ్రామంలోని నాటి యువకులు నేటి వృద్ధులైన వారి మదిలో తెలియని మనోవేదన ఆందోళన కనిపిస్తుంది. తమ వారిని కోల్పోయామన్న ఆవేదన, చరిత్ర యాదిలో మధిర మండలం నక్కలగరుబు (బుచ్చిరెడ్డిపాలెం) జరిగిన విషాదం తెలియాలంటే ఇది చదవాల్సిందే. అది 1969 మే 19 ఆనాడు రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న తుఫాను పరిస్థితులు, ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్న వరుణదేవుడు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో జీవనదులతోపాటు వాగువంక, పిల్ల కాలువలతో సహా ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తూ పంటలను చెట్టు పుట్టను పశుసంపదను తమలో కలుపుకుంటూ ఉరకలేస్తూ ప్రవహిస్తున్నాయి. ఆనాడు అంతంతమాత్రంగా ఉన్న సమాచార వ్యవస్థ కేవలం రేడియో వార్తలు మాత్రమే ప్రజలను జాగృతం చేసేవి, ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగుతున్న వరదలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. జరుగుతున్న నష్టంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా అనుకూలంగా నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు ముందడుగులు వేశాయి. ఈ పరిస్థితులను వినడమే తప్ప ఎన్నడూ చూడని నేటి మధిర మండలంలోని నాటి మధిర తాలూకాలోని నక్కలగరువు గ్రామం వైరా సమీపాన ఉండేది.

అయితే సాయంత్రం సుమారుగా 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పెరిగిన వరద ఉధృతితో భీకర రూపాన్ని దాల్చిన ఏరు తమ సమీప పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలను పశుసంపదను తనలో కలుపుకుంటూ ఒకసారి గా నక్కలగురువు గ్రామం పై పడింది. ఊహించని ఈ పరిణామంతో నిశ్చేస్టులుగా మారిన గ్రామస్తులు గంగమ్మ తల్లికి ప్రణమిల్లినా కూడా కనికరించకుండా గ్రామంలోని 42 మందిని తనలో కలుపుకొని పోయింది. అభాగ్యుల ఆర్తనాదాలు, తమవారు వరదలో కొట్టుకుపోతున్నా తమను తాను కాపాడుకోవడం తప్ప ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితులతో ఉబికి వస్తున్న కన్నీటి దారాలు కూడా వరుణుడి జల్లుల జడిలో కలిసిపోవడం తో వీరి ఆర్తనాదాలు భగవంతునికి తప్ప మరెవరికి వినిపించని దురదృష్టకర సంఘటన అది. ఆనాటి వరద ఉధృతిలో భూమిపై నూకలు ఉన్న కొద్దిమంది చెట్టు పుట్టను పట్టుకొని బతుకు జీవుడా అంటూ ప్రాణాలు నిలుపుకున్న వారు పూర్తిగా నిరాశ్రులైపోయారు.

ఈ సంఘటన జరిగి సరిగ్గా 45 ఏళ్లు ఆనాటి ప్రకృతి సృష్టించిన దుర్ఘటన సంఘటనను గుర్తు చేసుకుంటూ గ్రామానికి చెందిన పలువురు ప్రతి ఏడాది నాడు ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకోవడం నేటికీ జరుగుతొంది. పూర్తి కమ్యూనిస్టు (సిపిఐ) గ్రామంగా ఉన్న ఈ గ్రామం తో పాటు వైరా ఏటి పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలను ఆనాటి కమ్యూనిస్టు నాయకుడు వాసిరెడ్డి వెంకటపతి ఆధ్వర్యంలో గ్రామాలను ఏటికి దూరంగా మధిర వైరా రహదారికి సమీపాన ఉన్న దిడుగు పాడు నేటి తిరుగుబాటు జిలుగుమాడు గ్రామానికి చేరువన ఉన్న ప్రభుత్వ భూమిలో స్థిరనివాసాలను ఏర్పరచుకునే దిశగా చేసిన కృషి ఆనాటి కమ్యూనిస్టు నాయకులకు ప్రజలతో ఉన్న సత్సంబంధాలకు నిదర్శనం. నిర్వచనం చరిత్రలో అజరామరం, ప్రస్తుతం గ్రామ పంచాయతీగా అన్ని మౌలిక వసతులతో పాటు అభివృద్ధిలో కొంతలో కొంత మెరుగ్గా ఈ గ్రామం పునర్నిర్మితమై ఉన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News