హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 198 కరోనా కేసులు నమోదుకాగా కరోనాతో ఇద్దరు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శుక్రవారం నాడు బులెటిన్ విడుదల చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుంచి మరో 153 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 3,723 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఎట్ రిస్క్ దేశాల నుంచి తెలంగాణకు 909 మంది రాగా శుక్రవారం నాడు ఒక్కరోజే ఎట్ రిస్క్ దేశాల నుంచి 219 మంది రాష్ట్రానికి వచ్చారు. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చినవారిలో 14 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో కరోనా బాధితుల శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్‌కు అధికారులు పంపారు.
పటాన్‌చెరువులో…
పటాన్‌చెరు మండలంలోని ఇంద్రేశం బిసి గురుకుల బాలికల పాఠశాలలో మరో 19 మందికి విద్యార్థినులకు పాజిటివ్ వచ్చిది. ఈక్రమంలో గురువారం నాడు నిర్వహించిన పరీక్షలలో విద్యార్థినులకు కరోనాగా తేలిన విషయం తెలిసిందే. దీంతో రెండోరోజు 584 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలలో 19 మందికి విద్యార్థినులకు పాజిటివ్ అని తేలింది. ఇప్పటివరకు పాఠశాలలో మొత్తం 46 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లయింది. వీరందరిని పాఠశాలలోనే ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కేసులు పెరుగుతుండడంతో భయంతో పిల్లలను ఇంటికి తీసుకెళ్తామని తల్లిదండ్రులు చెబుతున్నారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడుతున్నారు. మూడు రోజుల్లో మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 48కి చేరింది. వీరిలో 47 మంది విద్యార్థులు ఒక ఉపాధ్యాయురాలు ఉన్నట్లు వైద్యులు వివరిస్తున్నారు.
ఎపిలో 138 కేసులు…
ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటలోల కొత్తగా 138 కరోనా కేసులు నమోదుకాగా ఒకరు కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇప్పటి వరకు ఎపిలో 20,73,390కి కరోనా కేసులు చేరాయి. కరోనాతో మొత్తం 14,445 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఎపిలో 2,157 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 20,56,788 మంది రికవరీ చెందారు.