Friday, January 24, 2025

భోపాల్ గ్యాస్ లీక్ కేసులో కేంద్రానికి ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సుమారు నాలుగు దశాబ్దాల నాటి భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో బాధితులకు మరింత నష్టపరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.1984 నాటి భోపాల్ గ్యాస్ లీకేజి దుర్ఘటనలో యూనియన్ కార్బైడ్ కంపెనీనుంచి అదనపు పరిహారం కోరుతూ కేంద్రప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.1984 డిసెంబర్ 3 వ తేదీ తెల్లవారుజామున భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఇండియా ప్లాంట్‌నుంచి మిథైల్ ఐసో సైనైట్ అనే అత్యంత విషపూరిత వాయువు లీకయింది. ఈ దుర్ఘటనలో అప్పటికప్పుడే 3 వేలమందికి పైగా చనిపోగా 1.02 లక్షల మంది విషవాయువు ప్రభావానికి లోనయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక విపత్తుగా దీన్ని పరిగణిస్తుంటారు. అప్పట్లో యూనియన్ కార్బైడ్ కంపెనీ పరిహారం కింద రూ.715 కోట్లు చెల్లించింది.

ఈ కేసును రీ ఓపెన్ చేయాలని, అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ యాజమాన్యంలోని కంపెనీలను రూ.7,844 కోట్ల అదనపు పరిహారం చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ కేంద్రప్రభుత్వం క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేసింది.1989 సెటిల్మెంట్ సమయంలో మానవ జీవితాలకు, పరావరణానికి జరిగిన వాస్తవ నష్టాన్ని సరిగా అంచనా వేయలేదని కేంద్రం వాదించింది. అయితే ఈ పిటిషన్‌ను అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చుతూ, మోసపూరితంగా మాత్రమే సెటిల్‌మెంట్‌ను పక్కన పెట్టవచ్చని, కేంద్రం ఆ పాయింట్‌పై ఎలాంటి వాదనలూ చేయలేదని పేర్కొంది. సెటిల్‌మెంట్ జరిగిన రెండు దశాబ్దాల తర్వాత ఈ అంశాన్ని లేవనెత్తడంలో హేతుబద్ధత కూడా లేదని తెలిపింది. క్యూరేటివ్ పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్లుగా పేర్కొంది.

పెండింగ్‌లో ఉన్న నష్టపరిహారాల క్లెయిమ్స్ పరిష్కారాల కోసం రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న రూ.50 కోట్ల మొత్తాన్ని వినియోగించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్రం వేసిన పిటిషన్‌పై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పును గత జనవరి 12న రిజర్వ్ చేసింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ కిషన్ కౌల్, జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ జెకె మహేశ్వర్ సభ్యులుగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News