న్యూఢిల్లీ: భారత్ 1991లో తెచ్చిన సంస్కరణలు అసంపూర్ణమైనవి కావడంతో మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి రాగానే ప్రాథమిక వ్యవస్థాగత మార్పులు చేపట్టిందని, తద్వారా పేదలు, బలహీనవర్గాల వారిపై పూర్తి శ్రద్ధ తీసుకోవడం జరిగిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం అన్నారు. ముంబైలో ఓ పుస్తకావిష్కరణ సభలో ఆమె ప్రసంగిస్తూ ఈ విషయం తెలిపారు. 2014లో మొదలెట్టిన సంస్కరణల ఫలితంగానే నేడు దేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. ఆమె హిందీలోనే ప్రసంగించారు. సోషలిజమ్ అన్నది విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారని ఆమె అన్నారు. తద్వారా ఆర్జించే వారిపై లైసెన్స్, రెగ్యులేషన్స్ విధానాలు అమలయ్యాయన్నారు.
“తప్పనిసరి పరిస్థితిలో 1991లో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు. కానీ దానిని సక్రమంగా నెరవేర్చలేదు. తద్వారా చెల్లింపుల సమతూకం సంక్షోభం ఏర్పడింది. దాంతో మనం అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సాయం తీసుకోవలసి వచ్చింది. అప్పుడు వారు సామ్యవాదాన్ని(సోషలిజం) వదులుకునే షరతు పెట్టారన్నారు. అలా 1991లో మనం అసంపూర్ణ సంస్కరణలు మొదలెట్టాం” అన్నారు. “సంస్కరణల మీద శ్రద్ధ పెట్టిన ప్రభుత్వం సామాన్యుల అవసరాల పట్ల జాగ్రత్త వహించింది” అన్నారు. తనకు తమిళ్, తెలుగులో ఉన్నంత పట్టు హిందీలో లేదని కనుక తన హిందీ ప్రసంగాన్ని ఔదార్యంతో స్వీకరించాలని నిర్మలా సీతారామన్ అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయాలన్నది ఒకనాటి జన్‌సంఘ్ డిమాండ్‌గా ఉండేదని, దానిని మోడీ ప్రభుత్వం నెరవేర్చిందని తెలిపారు. ఆర్టికల్ 370 అనేది శాశ్వతం ఏమి కాదని నెహ్రూ అన్నదాన్ని రాజకీయ పార్టీలు మరచిపోయాయని అన్నారు. ఎయిర్ ఇండియా విషయంలో కూడా ప్రభుత్వం పెట్టుబడి ఉపసంహరణ అనే కీలక నిర్ణయం తీసుకుందన్నారు. ఇదిలావుండగా నిర్మలా సీతారామన్ 1991 ఆర్థిక సంస్కరణలపై అన్నదాన్ని మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ట్విట్టర్ ద్వారా ఎండగట్టారు.
The FM is reported to have said that the 1991 reforms were "half-baked"
Thank God, Dr Manmohan Singh did not serve over-cooked and unpalatable food like Demonetisation, multiple-rates GST and savage taxes on petrol & diesel
— P. Chidambaram (@PChidambaram_IN) September 16, 2022