రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్ : పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజీ నారాయణ రావు అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభివర్ణించారు. రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో ప్రజాకవి కాళోజీ నారాయణ రావు 19 వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రజాకవి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కాళోజీ నారాయణ రావు స్వాతంత్ర సమరయోధులని, తెలంగాణ ఉద్యమకారులు, నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకు వ్యతిరేకంగా కలం ఎత్తిన గొప్ప యోధుడని మంత్రి అభివర్ణించారు. కాళోజీ అందించిన సేవలను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ ఉద్యమ నిర్మాత సిఎం కెసిఆర్‌కు కాళోజీ రచనలు, కవిత్వం అంటే తనకు ఎంతో అభిమానమన్నారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రజాకవి కాళోజీని గౌరవిస్తూ ఆయన జయంతి సందర్భంగా (సెప్టెంబర్ – 9)న ‘తెలంగాణ భాషా దినోత్సవం’ గా నిర్వహిస్తున్నామన్నారు. అలాగే వరంగల్‌లో ఉన్న ‘ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయానికి, హన్మకొండ పట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ’కళాక్షేత్రం’కు పద్మవిభూషణ్ కాళోజీ నారాయణ రావు పేరును పెట్టి గౌరవించుకుంటున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ప్రో. జయధీర్ తిరుమల రావు, ప్రో.మనోజ తదితరులు పాల్గొన్నారు.