Sunday, December 22, 2024

తుంగభద్రమే..నా?

- Advertisement -
- Advertisement -

కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్ 33గేట్లలో 19వ నెంబర్ గేటు శనివారం రాత్రి కొట్టుకుపోయింది. గేట్లు మూసి వేస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. గేటు చైన్‌కు ఉన్న లింక్ తెగి గేటు నీటి వత్తిడికి కొట్టుకుపోయింది. దీంతో మొత్తంగా ప్రాజెక్టు నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని విగువకు విడుదల చేస్తున్నారు. నదిలో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగటంతో తెలుగు రాష్ట్రాల అధికారులు అప్రమత్తమయ్యారు. కర్నూలు – మహబూబ్‌నగర్ జిల్లాల్లోని నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.తుంగభద్ర ప్రమాద ఘటనపై కర్ణాటక ప్రభుత్వం వెంటనే స్పందించింది. గేటు పునరుద్దరణకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది.

ఆదివారం కర్ణాటక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ మాట్లాడుతూ తుంగభద్ర డ్యామ్ 19వగేటు ధ్వసం కావటం బాధకారం అన్నారు. ఈ ప్రాజెక్టు కర్ణాటక ,తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వర ప్రదాయని అన్నారు. తుంగభధ్ర డ్యామ్‌లో 40టిఎంసీల మేరకు మాత్రమే నీటిని వుంచి మిగిలిన నీటినంతా డ్యామ్ దిగువన నదిలోకి విడుదల చేస్తే గేటు రిపేర్లకు ఆస్కారం ఉంటుందని వెల్లడించారు. వీలైనంత వేగంగా గేటును పునరుద్దరిస్తామని ప్రకటించారు. ఈ ఏడాది ఈ ప్రాజెక్టు కింద ఖరీఫ్ పంటలకు మాత్రమే నీటిని అందించగలమన్నారు. రబీ పంటలకు నీటిని అందించటం కొంచెం కష్టమే అని , ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు సహకరించాలని డి.కె శివకుమార్ విజ్ణప్తి చేశారు.

పంటలకు నష్టం లేకుండా చూడండి:
తుంగభద్ర ప్రాజెక్టు పరిధిలొని ఆయకట్టులో పంటలకు నష్టం లేకుండా చూడాలని , తాత్కాలికంగా స్టాప్‌లాక్ గేటు ఏర్పాటు చేయటంపై టీబీ డ్యాం అధికారులతో మాట్లాడి తగిన సహకారం అందించాలని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్‌ను, ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి పయ్యావుల కేశవ్‌లతో మాట్లాడారు. తాత్కాలిక గేటు ఏర్పాటు చేయటంపై టీబీ డ్యాం అధికారులతో మాట్లాడి తగిన సహకారం అందించాలని మంత్రి పయ్యావుల కేశవ్‌ను సీఎం ఆదేశించారు. తాత్కాలికంగా స్టాప్‌లాక్ గేటు ఏర్పాటు చేయడానికి ఇబ్బందులు ఉన్నాయని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు.

టీబీ డ్యాం 1960లో నిర్మించిన పాత డిజైన్ కావడంవల్ల స్టాప్‌లాక్ గేట్ ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొందని మంత్రి పయ్యావుల, చంద్రబాబుకు తెలిపారు. అలాగే నీటిపారుదలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో సీఎం మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోయిన వెంటనే రాష్ట్రంలోని ఉన్నతాధికారులను అప్రమత్తం చేసినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. డ్యామ్ అధికారులతోనూ మాట్లాడినట్లు చెప్పారు. తెల్లవారుజామున గేటు కొట్టుకుపోవడం, ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున నీరు వృథాగా పోతుందన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు తుంగభద్ర డ్యామ్ గుండెకాయలాంటిదన్నారు. దీని నమ్ముకుని లక్షలాదిమంది రైతులు పంటలు వేశారని, నీరు వృథాగా పోకుండా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.

గేటు ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు :మంత్రి శివరాజ్
తుంగభద్ర ఆనకట్ట 19వ క్రస్ట్ గేట్ చైన్‌లింక్ తెగిపోవడంపై కర్ణాటక రాష్ట్రం, కొప్పాల జిల్లా ఇన్‌చార్జి మంత్రి శివరాజ్ మీడియాతో మాట్లాడారు. గేటు ద్వారా 35 వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతోందని వెల్లడించారు. గేటు మరమ్మతు ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని తెలిపారు. జలాశయంలోని 65 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంటుందన్నారు. దాదాపు 65 టీఎంసీల నీటిని ఖాళీ చేయడం తప్ప రిజర్వాయర్ భద్రతకు ప్రత్యామ్నాయం కనిపించడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని గేట్ల నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. 20 అడుగుల నీరు ఖాళీ అయితే తప్ప గేటు పరిస్థితి ఏమిటో చెప్పలేమన్నారు.

తుంగభద్రకు ఎగువ నుంచి తగ్గిన వదర :
తుంగభద్ర ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద ప్రవాహం ఆదివారం సాయంత్రానికి తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టులో నీటిమట్టం 1632 అడుగుల వద్ద నీటినిలువ 104టిఎంసీలకు చేరింది.ఎగువ నుంచి 36739క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టు నుంచి దిగువకు 55327క్యూసెక్కు నీటిని విడుదల చేస్తున్నారు.

శ్రీశైలంకు 2.18లక్షల క్యూసెక్కలు:
ఎగువన కర్ణాటకలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి.దీంతో కృష్ణా నదిలో వరద కూడా స్వల్పంగా తగ్గింది. అల్మట్టి ప్రాజెక్టులోకి 56వేలక్యూసెక్కుల వరద నీరు చేరుతండగా , ప్రాజెక్టు నుంచి 15వేలక్యూసెక్కుల నీటిని బయటకు వదులు తున్నారు. జూరాలకు 85000క్యూసెక్కుల నీరు చేరుతుండగా ,ప్రాజెక్టు నుంచి 82339క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సుంకేసుల వద్ద తుంగభద్ర నదిలో లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇటు తుంగభద్ర అటు కృష్ణా నదుల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టులోకి 2.18లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుతుండగా ప్రాజెక్టు నుంచి 2.84లక్షల క్యూసెక్కలు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1.86లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టు నుంచి 1.04లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News