న్యూఢిల్లీ : గురువారం సాయంత్రం 6 గంటల వరకు మిలియన్ హెల్త్‌కేర్ వర్కర్లకు టీకాలు అందాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీరు కాక 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 4043 వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా మరో 2,33,530 మంది లబ్ధిదారులకు టీకాలు అందాయి. దేశం మొత్తం మీద కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం ఆరో రోజుకూడా జయప్రదమైందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ మనోహర్ అగ్నాని వెల్లడించారు. 18,161 కేంద్రాల ద్వారా మొత్తం 10,40,041 మంది హెల్త్‌కేర్ వర్కర్లకు టీకాలు అందాయని చెప్పారు. ఈ సందర్భంగా 187 దుష్ప్రభావాల కేసులు నమోదయ్యాయని తెలిపారు. జనవరి 16 న టీకా తీసుకున్న వ్యక్తికి జనవరి 20 న ఇంట్రా క్రేనియల్ హెమెరేజి రావడంతో రాజస్థాన్ ఉదయ్‌పూర్ గీతాంజలి మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్చినట్టు తెలిపారు. అయితే ఇది వ్యాక్సిన్ వల్ల వచ్చింది కాదని అగ్నానీ తెలిపారు.