Wednesday, January 22, 2025

2.5 బిలియన్ ఏళ్ల నాటి కృష్ణ శిలతో రామ్ లల్లా విగ్రహం

- Advertisement -
- Advertisement -

కర్నాటక నుంచి ప్రత్యేకంగా రవాణా

న్యూఢిల్లీ : సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రాణ ప్రతిష్ఠ చేసిన రామ్ లల్లా లేక బాల రాముని విగ్రహానికి అయోధ్యలోని కొత్త రామ మందిరం కొత్త ఆశ్రయం అయింది. 51 అంగుళాల విగ్రహం తయారీకి ఉపయోగించిన శిల కర్నాటక నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన కృష్ణ శిల. ‘ఆ శిల 2.5 బిలియన్ ఏళ్ల నాటిది’ అని బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (ఎన్‌ఐఆర్‌ఎం) డైరెక్టర్ హెచ్ ఎస్ వెంకటేశ్ ధ్రువీకరించారు. భౌతిక, యాంత్రిక విశ్లేషణ పద్ధతి ద్వారా ఆ శిలను పరీక్షించడానికి తోడ్పడిన జాతీయ సంస్థ అది.

భారతీయ డ్యామ్‌లు, అణు విద్యుత్ కర్మాగారాలకు రాళ్లను పరీక్షించే ప్రత్యేక సంస్థ ఎన్‌ఐఆర్‌ఎం. ‘ఆ శిల చిరకాలం మన్నేది. వాతావరణ మార్పులకు తట్టుకుంటుంది. కనీస నిర్వహణతో ఈ ఉష్ణ వాతావరణంలో వేలాది సంవత్సరాలు మన్నుతుంది’ అని డాక్టర్ వెంకటేశ్ వివరించారు. ఆ శిల చాలా గట్టి పదార్థం. రామ మందిరం సాంప్రదాయక వాస్తు శైలులు ఉపయోగించి నిర్మించినదని, కానీ చిరకాలం మన్నే విధంగా ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని, ఇంజనీరింగ్ పద్ధతులను విగ్రహం తయారీలో పొందుపరిచారని కేంద్ర వైజ్ఞానిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ‘అది వెయ్యి సంవత్సరాలకు పైగా మన్నే విధంగా రూపొందించినట్టిది’ అని మంత్రి తెలిపారు.

అత్యున్నత శ్రేణి గ్రానైట్ గనులకు పేరొందిన మైసూరు జిల్లా జయపుర హొబ్లి గ్రామం నుంచి ఆ శిలను ఎంపిక చేశారు. ఆ శిల కాంబ్రియన్ శకానికి ముందు నాటిది. అది సుమారు 400 కోట్ల సంవత్సరాల నాటిదని అంచనా. ఐదు తరాల శిల్పుల కుటుంబానికి చెందిన, మైసూరు కేంద్రంగా గల 38 ఏళ్ల అరుణ్ యోగిరాజ్ ఆ శిలను అందమైన బాలునిగి చెక్కారు. రామ్ లల్లా విగ్రహం రూపకల్పనకు ఆయనకు దాదాపు ఆరు మాసాల సమయం పట్టింది. ఆయన రూపొందించిన ప్రముఖ శిల్పాలలో ఢిల్లీలో ఇందిరా గేట్ వద్ద ప్రతిష్ఠించిన 30 అడుగుల నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కృష్ణ శిల విగ్రహం ఒకటి. రామ్ లల్లా విగ్రహం కోసం ఉపయోగించిన శిల నీటిని పీల్చుకోదు. అది కర్బనం ప్రతిస్పందనకు కూడా గురి కాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News