Thursday, January 23, 2025

యువతకు 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు : రాహుల్ హామీ

- Advertisement -
- Advertisement -

బెళగావి : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు గెలుపే లక్షంగా పనిచేస్తున్నాయి. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ మాండ్యలో ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించి ప్రసంగించగా, తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బెళగావిలో యువక్రాంతి సమావేశంలో పాల్గొన్నారు. యువఓటర్లను ఆకర్షించేందుకు కీలక హామీలు ప్రకటించారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులైన గ్రాడ్యుయేట్లకు రెండేళ్ల పాటు నెలకు రూ.3 వేలు, డిప్లొమా వారికి రూ. 1500 వంతున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు.

ఏడాదిన్నర కాలంలో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు మొత్తంగా 10 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ నేతలంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఐక్యంగా పనిచేయాలని, రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించాలన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో అధికారంలో ఉన్న బొమ్మై సారధ్యం లోని బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కర్ణాటక ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి మయమైన సర్కార్ అని, ఏదైనా పని జరగాలంటే 40 శాతం కమిషన్ ఇవ్వాల్సిందేనంటూ విరుచుకుపడ్డారు. అధికార బీజేపీకి మిత్రులైన కొద్దిమందికే అన్ని ప్రయోజనాలు చేకూరుతున్నాయని , ఇదే చివరకు అవినీతికి దారి తీస్తోందన్నారు. ఈ దేశం ప్రతి ఒక్కరిదీ అని, అదానీ లాంటి ఎంపిక చేసిన ఇద్దరు ముగ్గురు వ్యక్తులదేం కాదన్నారు. ఈ సభలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సిఎం సిద్ద రామయ్య , కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా తదితర నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News