Monday, December 23, 2024

రాష్ట్రవ్యాప్తంగా చేతులు మారిన 2.50 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు

- Advertisement -
- Advertisement -
పాసుబుక్‌లను ఆపివేసిన ప్రభుత్వం
ఆ భూములను స్వాధీనం చేసుకొని పరిశ్రమలు, వివిధ అభివృద్ధి పనులకు వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయం

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు చేతులు మారాయని ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ అధికారులు నివేదిక అందించారు. ఈ నేపథ్యంలోనే అసైన్డ్, ఇనాం భూములకు సంబంధించి ఐదేళ్లుగా పాసు పుస్తకాల జారీని ప్రభుత్వం నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఆయా భూములను వివిధ అభివృద్ధి పనులకు, వివిధ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సేకరించాలని నిర్ణయించింది. వాటిని కొనుగోలు చేసిన లబ్ధిదారులు తమకు పట్టాలు దక్కవన్న ఉద్ధేశ్యంతో ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే తమకు కూడా పట్టాలను పంపిణీ చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేయగా చాలామంది ఆయా భూములను విక్రయించడంతో ప్రభుత్వం ఆ భూములను వివిధ అభివృద్ధి పనుల కోసం వినియోగించాలని నిర్ణయించింది.

ఈసారి వ్యవసాయ భూములు మాత్రమే….
దీంతో పేదలకు పంచిన అసైన్డ్ భూముల్లో ఎన్ని వారి వద్ద ఉన్నాయి, మిగతావి ఎవరి వద్ద ఉన్నాయి, ఆ భూములను ఎప్పుడు అమ్ముకున్నారు తదితర విషయాలను అధ్యయనం చేసిన అన్ని జిల్లాల కలెక్టర్‌లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీంతోపాటు అసైన్డ్ భూములకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉన్న విధానాలను అధ్యయనం చేయాలని రెవెన్యూ శాఖ అధికారులకు ప్రభుత్వం బాధ్యతలను అప్పగించడంతో సీనియర్ అధికారులు దీనిపై అధ్యయనం చేసి నివేదికను ప్రభుత్వానికి అప్పగించారు. అయితే గతంలో పంపిణీ చేసిన అసైన్డ్ భూముల్లో కమర్షియల్ భూములు కాకుండా వ్యవసాయ భూములను మాత్రమే ఈసారి నిరుపేదలకు పంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది.

1954 నుంచి రాష్ట్రంలో 13 లక్షల మంది పేదలకు 22.52 లక్షలకు పైగా ఎకరాల భూమిని ప్రభుత్వం పంపిణీ చేసింది. 2017 అనంతరం వివిధ కారణాలతో అసైన్డ్, ఇనాం లబ్ధిదారులకు పట్టాల జారీని ప్రభుత్వం ఆపివేసింది. ఇప్పటికీ ఏడున్నర లక్షల ఎకరాల భూములకు కొత్త పాసు బుక్‌లను జారీ చేయలేదు. ఆయా భూములను సాగు చేయకపోవడం, చేతులు మారాయన్న కారణాలతో ఎక్కువ శాతం భూమిని నిషేధిత జాబితాలో పెట్టారు.

రాష్ట్రవ్యాప్తంగా 22,52,340.37 ఎకరాల అసైన్డ్ భూములు
రాష్ట్రవ్యాప్తంగా 22,52,340.37 ఎకరాల అసైన్డ్ భూములు ఉండగా, 15,87, 021 మంది లబ్ధిదారులకు ఈ భూములను ప్రభుత్వం కేటాయించింది. అందులో 3,55,441.62 ఎకరాల భూమి వ్యవసాయానికి అనుకూలంగా లేదని ప్రభుత్వం గుర్తించింది. ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా 1.85 లక్షల ఎకరాల అసైన్డ్ భూములుండగా, వీటిలో 1.78 లక్షల ఎకరాల భూమి వ్యవసాయ యోగ్యంగా ఉందని అధికారులు తేల్చారు. హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 291 ఎకరాల భూమి ఉండగా ఒక్క ఎకరంలో కూడా వ్యవసాయ సాగు కావడంలేదని అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో తేల్చారు. వ్యవసాయం యోగ్యంకాని భూములు ఎక్కువగా నల్లగొండ జిల్లాలో 1.38 లక్షల ఎకరాలు ఉండగా అందులో 1,386 ఎకరాల్లోనే పంట సాగు అవుతుందని ప్రభుత్వం గుర్తించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం కేటాయించిన భూమి అంతా సాగు భూమేనని అధికారులు గుర్తించారు.

చేతులు మారిన లక్షల ఎకరాలు
రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, నల్గొండ, మహబూబ్‌నగర్‌లోని అసైన్డ్ భూముల యజమానులు పట్టాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ జిల్లాలోని చాలా ప్రాంతాలు కొత్త మున్సిపాలిటీలుగా మారాయి. దీంతోపాటు అసైన్డ్ భూములను గతంలో రైతులు అమ్ముకోవడంతో వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించడంతో ప్రస్తుతం ఆ భూములను కొనుగోలు చేసిన రైతులంతా తమకు పట్టాలు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం రంగారెడ్డిలో 1.27 లక్షలు, మెదక్‌లో 2.55, నల్లగొండలో 1.82, మహబూబ్‌నగర్‌లో 2.06 లక్షల ఎకరాల భూములను గతంలో ప్రభుత్వం పంపిణీ చేయగా ప్రస్తుతం ఆయా భూములకు సంబంధించి సుమారుగా 1.50 లక్షల ఎకరాల భూమి చేతులు మారినట్టుగా అధికారులు గుర్తించారు.

2014 మార్చిలో హైకోర్టు తీర్పు
1958 జూలై కన్నా ముందు ఉన్న అసైన్డ్ భూములు పొందిన రైతులకు విక్రయ హక్కులు వర్తిస్తాయని 2014 మార్చిలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం లబ్ధిదారులు ఎవరికైనా విక్రయించుకునేందుకు వీలుంటుంది. ఇనాం భూములకు అధీకృత ధ్రువపత్రం జారీ చేసి (ఓఆర్సీ) పట్టాలు జారీ చేయాలని నిబంధనలు సూచిస్తున్నా చాలా జిల్లాల్లో అమలు కావడం లేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News