Wednesday, January 22, 2025

బంగ్లాదేశ్ సరిహద్దులో మహిళపై అత్యాచారం..

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: భారత్-బంగ్లాదేశ్ సమీపాన ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలకు గురైన ఇద్దరు సరిహద్దు భద్రతాదళ సిబ్బందిని అరెస్టు చేసినట్టు పారామిలిటరీ ఆర్గనైజేషన్ సీనియర్ అధికారి శనివారం తెలిపారు. నిందితులను సస్పెండ్ చేసి కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీకి ఆదేశించినట్టు బిఎస్‌ఎఫ్ సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్ అధికారి ఒకరు తెలిపారు. పశ్చిమబెంగాల్ లోని 24 పరగణాల జిల్లాలోని బగ్దా సరిహద్దు ఔట్ పోస్ట్ వద్దకు వచ్చిన ఒక మహిళపై ఈ నెల 26న అత్యాచారం చేసినట్టు బయటపడింది. భారత్ నుంచి బంగ్లాదేశ్ లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఆ మహిళను బిఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ అడ్డుకుని సమీపంలోని పొలాల వైపు లాక్కెళ్లి అత్యాచారం చేశాడు.

దీనికి ఎఎస్‌ఐ సహకరించాడని అధికారి వివరించారు. నిందితులు 68 బెటాలియన్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎస్‌పి చెరో, కానిస్టేబుల్ అల్తాబ్ హొస్సైన్‌గా గుర్తించారు. వీరిద్దరినీ సస్పెండ్ చేసి, కోర్టు ఆఫ్ ఎంక్వయిరీకి ఆదేశించినట్టు ఫ్రాంటియర్ అధికారి తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుపై ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. తమ బంధువుల్లో ఒకరికి అస్వస్థతగా ఉందని తెలిసి తాను, తన కుటుంబ సభ్యులు గురువారం రాత్రి బగ్దా సరిహద్దు వద్ద జిత్‌పూర్ మీదుగా సరిహద్దు దాటుతుండగా, నిందితులు ఇద్దరూ తనను నిషేధ ప్రాంతానికి లాక్కొని వెళ్లి అత్యాచారం చేశారని బాధితురాలు పోలీస్‌లకు చేసిన ఫిర్యాదులో ఆరోపించింది.
టిఎంసీ, బీజేపి మాటల యుద్ధం…
ఈ సంఘటన తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి)కు, బీజేపికి మధ్య మాటల యుధ్ధానికి దారి తీసింది. అంతర్జాతీయ సరిహద్దు నుంచి బిఎస్‌ఎఫ్ పరిధిని 15కిమీ పరిధి నుంచి 50కిమీ వరకు విస్తరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మొదట్నుంచీ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వ్యతిరేకిస్తున్నారు.

ఈ ఘటనపై టీఎంసీ ఓ ట్వీట్‌లో కేంద్రంపై విమర్శలు గుప్పించింది. బాధితురాలిని ఇద్దరు బిఎస్‌ఎఫ్ జవాన్లు అత్యాచారం చేయడమే కాక, ఎవరికీ చెప్పరాదని కూడా బెదిరించారని టిఎంసి ఎంపీ కాకోలీ గోష్ దస్తోయిదార్ ఆరోపించారు. నరేంద్రమోడీ పాలనలో దేశంలోని మహిళలకు భద్రత లేకుండా పోయిందని, రక్షక సిబ్బంది భక్షకులుగా మారుతుండడాన్ని నరేంద్రమోడీ తీవ్రంగా పరిగణించాలని వ్యాఖ్యానించారు. ఈ విమర్శలను బిజెపి తిప్పి కొట్టింది. చెదురుమదురు సంఘటనలను సాకుగా చూపించి మొత్తం బలగాల ప్రతిష్టను దిగజార్చడం సరికాదని బీజేపీ పేర్కొంది. ఎవరు నేరం చేసినా చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుందని బీజేపీ ప్రతినిధి షమిక్ భట్టాచార్య పేర్కొన్నారు. ఆర్మీ జవాన్లపై గతంలో ఇలాంటి ఆరోపణలు అనేకం వచ్చాయని, వాటిలో చాలామట్టుకు అబద్ధపు ఆరోపణలుగా తేలాయని బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ వ్యాఖ్యానించారు. ఇప్పుడీ ఆరోపణ ఎంతవరకు నిజమో లేక అబద్ధమో తెలీదని, ఇది వాస్తవం అయితే నిందితులకు తగిన శిక్ష పడుతుందని పేర్కొన్నారు.

2 BSF Personnel Arrested for raping Woman in Bengal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News