Sunday, December 22, 2024

రోడ్డు ప్రమాదంపై విచారణకు వెళ్లి ఇద్దరు పోలీస్‌లు మృతి..

- Advertisement -
- Advertisement -

చెన్నై: రోడ్డు ప్రమాదంపై విచారణ చేస్తుండగా, ఒక వ్యాను వచ్చి ఢీకొనడంతో ఇద్దరు తమిళనాడు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో పుదుచత్రం స్పెషల్ సబ్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్, కానిస్టేబుల్ దేవరాజన్ ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు డైవర్షన్ బోర్డును ఒక ఫోర్డ్ కారు ఢీకొన్న ఘటనపై చంద్రశేఖర్, దేవరాజన్ శనివారం రాత్రి విచారణ జరిపారు. హైవేపై రాత్రి గస్తీలో ఉన్న పళని, మణికందన్ కూడా వీరికి సహకరించారు. ఈ క్రమంలోనే రాత్రి 2.10 గంటల ప్రాంతంలో వేగంగా వస్తున్న ఒక లారీ దాదాపు ఫోర్డ్ కారును ఢీకొనేంత దగ్గరకు రావడంతో పోలీస్ టీమ్ ఆ లారీని ఆపింది. డ్రైవర్‌ను కిందకు దింపి ప్రశ్నించింది.

ఆ సమయంలో వారు లారీ వెనుకవైపు ఉన్నారు. అదే సమయంలో సేలం వెళ్తున్న ఒక వ్యాను అత్యంత వేగంతో ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్, దేవరాజన్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో కానిస్టేబుల్ మనికండన్, వ్యానులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు గాయపడటంతో వారిని ఆస్పత్రిలో చేర్చారు. రోడ్డు ప్రమాదంపై విచారణకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఎస్‌ఎస్‌ఐ, కానిస్టేబుల్ మృతికి ముఖ్యమంత్రి స్టాలిన్ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు రూ. 25 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.

2 Cop killed in Road Accident in Tamil Nadu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News