Thursday, January 23, 2025

బండి సంజయ్ యాత్రకు బ్రేక్..

- Advertisement -
- Advertisement -

2 days break to Bandi Sanjay padayatra

మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పాదయాత్రకు బ్రేక్ పడింది. రెండ్రోజుల పాటు ప్రజా సంగ్రామ యాత్రకు బండి సంజయ్ విరామం ఇవ్వనున్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ వడ దెబ్బకు గురయ్యారు. దీంతో రెండు రోజుల పాటు పాదయాత్రకు విరామం ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ నెల 14వ తేదీన జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించారు. గద్వాల జోగులాంబ జిల్లాలో ప్రస్తుతం బండి సంజయ్ యాత్ర కొనసాగుతుంది. ఈ నెల 23వ తేదీకి బండి సంజయ్ 100 కి.మీ పాదయాత్ర పూర్తి చేశారు. ఆదివారం నాడు బండి సంజయ్ పాదయాత్ర నర్వ-పాతర్ చేడు గ్రామాల మధ్యకు చేరుకొనే సమయానికి వడదెబ్బకు గురయ్యాడు. దీంతో బండి సంజయ్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ శరత్ ఆయనకు పరీక్షలు నిర్వహించాడు. వడదెబ్బకు గురైన బండి సంజయ్ ను విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు. అయితే పాదయాత్రను కొనసాగించాలని బండి సంజయ్ నిర్ణయం తీసుకొన్నాడు.
సమాచార లోపం వల్లే..
బండి పాదయాత్ర కొనసాగుతుందన్న రాణిరుద్రమ దేవి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన రెండో విడత “ప్రజా సంగ్రామ యాత్ర” రెండ్రోజుల పాటు వాయిదా పడుతుందనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి వెల్లడించారు. ప్రజా సంగ్రామ యాత్ర యధావిధిగా కొనసాగుతుందన్నారు. ఈ రోజు మక్తల్ లో జరిగే బహిరంగ సభ అనంతరం సోమవారం రాత్రి బస చేసే శిబిరం నుండే మంగళవారం యధావిధిగా పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. గత 12 రోజులుగా మండుటెండలో పాదయాత్ర చేయడంవల్ల బండి సంజయ్ వడ దెబ్బకు గురయ్యారని తెలిపారు. దీనికితోడు ఎసిడిటీ సమస్య తోడవడంతో అస్వస్థతకు లోనయ్యారని వెల్లడించారు. బండి సంజయ్ కు చికిత్స చేస్తున్న డాక్టర్లు ఆయన ఆరోగ్య రీత్యా పాదయాత్రకు విరామం ఇవ్వాలని సూచించారన్నారు. బండి సంజయ్ మాత్రం పాదయాత్ర కొనసాగించడానికే మొగ్గు చూపారని తెలిపారు. ఈ నేపథ్యంలో పాదయాత్రను యథావిదిగా కొనసాగనుందని స్పష్టం చేశారు. సమాచార లోపం వల్ల మాత్రమే పాదయాత్రకు రెండ్రోజులు విరామం ఇస్తున్నట్లు పొరపాటుగా వెలువరించడం జరిగిందన్నారు.

2 days break to Bandi Sanjay padayatra

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News