Friday, November 22, 2024

బూస్టర్ డోసుల కన్నా 2 డోసుల పంపిణీ పూర్తి ముఖ్యం..

- Advertisement -
- Advertisement -

2 doses Distribution more important than booster dose: Experts

న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్‌పై ఆందోళనలు పెరుగుతుండడం, ఇన్‌ఫెక్షన్‌ను నిరోధించే వ్యాక్సిన్ ప్రేరేపిత రక్షణ క్షీణిస్తుండడంతో అత్యంత దుర్బలత్వ ప్రజలను రక్షించడానికి బూస్టర్ డోసులు అవసరమన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో బూస్టర్ డోసులకు అనుమతిపై నిర్ణయం తీసుకోవాలని కేరళ, రాజస్థాన్, కర్ణాటక, చత్తీస్‌గఢ్, రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాయి. సీరం ఇనిస్టిట్యూట్ బూస్టర్ డోసును వినియోగించడానికి గురువారం భారత్ ఔషధ నియంత్రణ మండలి నుంచి అనుమతి పొందింది. బూస్టర్ డోసు వినియోగం తప్పనిసరి అని నిర్ణయించడానికి శాస్త్రీయపరమైన కారణాలను పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం అందరికీ టీకా రెండు డోసులు పూర్తి చేయడమే ప్రధాన లక్షంగా కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం 36 దేశాలు బూస్టర్ డోసులను ఇవ్వడం ప్రారంభించాయి. అయితే ప్రపంచంలో అత్యంత దుర్బలమైన ప్రజలందరికీ పూర్తిగా వ్యాక్సిన్ అందించడం తప్పనిసరి అని ప్రపంచ ఆరోగ్యసంస్థ స్పష్టం చేస్తోంది. ఈనేపథ్యంలో వైద్య నిపుణులు బూస్టర్ డోసుల కోసం సలహా ఇవ్వడం కన్నా ఇంకా వ్యాక్సిన్ పొందని వారికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడం, దీంతోపాటు కొవిడ్ నిబంధనలు పాటించడం, మాస్క్‌లు ధరించడం, చాలా అవసరమని తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు.

వ్యాక్సిన్ బూస్టర్ పనిచేసినా తాత్కాలిక పరిష్కారమే అని అభిప్రాయ పడ్డారు. ఈ నేపథ్యంలో భారత్‌లో ప్రాధాన్యత భిన్నంగా ఉంటోందని, ఎందుకంటే భారత్‌లో కేవలం ఆరు, ఎనిమిది నెలల క్రితమే టీకా డ్రైవ్‌ను భారీ ఎత్తున ప్రారంభించారని అందువల్ల అర్హులైన వారందరికీ టీకా రెండు డోసులు అందించడమే ప్రధాన కర్తవ్యంగా అనేక మంది వైద్య నిపుణులు తమ అభిప్రాయాలను వెలువరించారు. 18 ఏళ్ల లోపు వారు జనాభాలో అత్యధికంగా ఉన్నారని, వీరందరికీ వ్యాక్సిన్ పూర్తయితేనే కానీ సెకండ్ బూస్టర్, లేదా థర్డ్ బూస్టర్ డోసుకు సలహా ఇవ్వడం మంచిది కాదని, ఇమ్యునాలజిస్టు వినీతాబాల్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. భారత్‌లో భారీ ఎత్తున టీకా డ్రైవ్ గత ఏడాది మార్చిలో ప్రారంభమైందని ఆమె గుర్తు చేశారు. వ్యాక్సినేషన్ పొందని వారితో పోలిస్తే బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్ల వల్ల తీవ్రత చాలా తక్కువగా ఉంటోందని బాల్ చెప్పారు. పుణె ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి లో అతిధి అధ్యాపకులుగా ఆమె పనిచేస్తున్నారు. భారత్‌లో ఇమ్యూనిటీ క్షీణిస్తోందనడానికి బలమైన డేటా అంటూ ఏదీ లేదని, అయితే కాలానుగుణంగా ఇమ్యూనిటీ క్షీణించవచ్చని అభిప్రాయపడ్డారు. పూర్తిగా వ్యాక్సిన్ పొందిన వారిలో ఇంకా రక్షణ కల్పించే శక్తి ఉంటోందని, ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా కన్నా వేగంగా వ్యాపిస్తుందని, సంక్రమిస్తుందని ఎవరికీ ఇంకా తెలీదని ఆమె చెప్పారు. వ్యక్తిగతంగా బూస్టర్ డోసులు వల్ల ఇదివరకటి స్పందనలను మరింత ప్రోత్సాహం కలుగుతుందని పేర్కొన్నారు. ఏదెలాగైనా ప్రస్తుతం వాడుకలో ఉన్న వ్యాక్సిన్ల వల్ల వేరియంట్ల నుంచి రక్షణ కలుగుతోందని అందువల్ల డెల్టాకు లేదా ఒమిక్రాన్‌కు ప్రత్యేకించి బూస్టర్‌డోసులు పనిచేస్తాయని చెప్పలేమన్నారు.

వైరస్ మ్యుటేషన్ కొనసాగుతుందని, అయినాసరే పేద, మధ్యాదాయ దేశాలతోపాటు వర్ధమాన దేశాల్లో కూడా అధికసంఖ్యలో ఇంకా వ్యాక్సిన్ పొందని వారున్నారని గుర్తు చేశారు. వ్యాక్సిన్ పొందిన తరువాత సీరంలో యాంటీబాడీల స్థాయిలు ఆరు మాసాల్లో తగ్గిపోతాయనడానికి సరైన ఆధారాలు లేవని తెలిపారు. వ్యాక్సిన్ బూస్టర్ డోసు పనిచేసినా తాత్కాలిక పరిష్కారం తప్ప ఇంకేమీ ఉండదని, దీనికన్నా మాస్క్‌లు ధరించడమే మంచిదని ముంబై ఆస్పత్రికి చెందిన అంటువ్యాధుల చికిత్స సలహాదారులు, మహారాష్ట్ర కొవిడ్ టాస్క్‌ఫోర్సు సభ్యులు వసంత్ నాగ్‌వేకర్ పేర్కొన్నారు. మాస్క్‌ల వల్ల కొవిడ్ వ్యాప్తి 53 శాతం వరకు తగ్గుతుందని సైంటిఫిక్ డేటా చెబుతోందని ఆయన ఉదహరించారు. ప్రతివేరియంట్‌కు, ప్రతి ఆరు మాసాలకు బూస్టర్ డోసు తీసుకోలేమని ఆయన అన్నారు. వ్యాక్సినేషన్‌కు ప్రత్యామ్నాయం మాస్కులు తప్ప వేరే ఏమీ లేవని చెప్పారు. న్యూఢిల్లీకి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ కి చెందిన సత్యజిత్ రథ్ ప్రపంచంలో ఏ వ్యాక్సిన్‌కైనా బూస్టర్ డోసు అవసరమని స్పష్టం కాలేదని అన్నారు. బూస్టర్ డోసుల వల్ల యాంటీబాడీల స్థాయిలు కొంతవరకు పెరగవచ్చని, అయితే ఆ అదనపు రక్షణ ఎంత కాలం ఉంటుందో చెప్పలేమన్నారు. ప్రస్తుత వ్యాక్సిన్ల తాలూకు బూస్టర్ డోసులు భవిష్య వేరియంట్ల నుంచి కాపాడగలవా? అని ప్రశ్నించారు. రీయూజబుల్, బయోడిగ్రేడ్ మాస్కులు ధరించడమే మంచిదని అవి కూడా విరివిగా లబిస్తున్నాయని పేర్కొన్నారు. ఈమేరకు సామాజికంగా కొవిడ్ నిబంధనలు కచ్చితంగా జనం పాటించేలా భారీ ఎత్తున ప్రచారం సాగించాల్సి ఉందన్నారు.
ఆరు వ్యాక్సిన్ల బూస్టర్ డోసులతో భద్రత
ది లాన్సెట్ అధ్యయనం ప్రకారం ఆస్ట్రాజెనెకా, ఫైజర్ వ్యాక్సిన్ల రెండు డోసులు పొందిన వారికి ఆరు వ్యాక్సిన్ల బూస్టర్ డోసుల వల్ల భద్రత కలగడమే కాక, బలమైన ఇమ్యూనిటీ ప్రజల్లో పెరుగుతుందని వెల్లడైంది. ఆస్ట్రాజెనెకా, ఫైజర్, నొవావాక్స్, జాన్‌సేన్, మోడెర్నా, వల్నేవా, క్యూర్‌వాక్ ఈ ఏడు వ్యాక్సిన్ల వల్ల ఏవైనా దుష్ఫలితాలు ఎదురైతే మూడో డోసు వాడడం శ్రేయస్కరమని ప్రొఫెసర్ సాల్ ఫాస్ట్ సూచించారు.
భారత్‌లో 126 కోట్ల డోసుల పంపిణీ
ఒమిక్రాన్ ఖండాంతరాలను అధిగమించి వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచం లోని దక్షిణార్ధ దేశాలకు వ్యాక్సిన్ వేగంగా, పూర్తిగా అందించడం తప్పనిసరి. ఇంతవరకు భారత్ 126 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు అందించింది. ఇందులో 79,68, 96,038 మందికి ఒక డోసు అందగా, 46. 6 కోట్ల మందికి రెండు డోసులు అందాయి.

2 doses Distribution more important than booster dose: Experts

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News