పరీక్ష రాయకుండా వెనుదిరిగిన ఆ ఇద్దరు విద్యార్థినులు
ఉడుపి(కర్నాటక): కర్నాటకలో తలెత్తని హిజాబ్ నిషేధ వివాదంలో శుక్రవారం కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. తరగతి గదుల్లో హిజాబ్ ధరించడానికి అనుమతించాలని కోరుతూ గతంలో హైకోర్టులో పిటిషన్ వేసిన ఇద్దరు విద్యార్థినులు శుక్రవారం 12వ తరగతి బోర్డు పరీక్ష రాయకుండానే వెనుదిరిగారు. బురఖా ధరించి ఫైనల్ పరీక్ష రాయడానికి వచ్చిన అలియా అస్సది, రేషమ్ అనే ఆ విద్యార్థినులను పరీక్షా కేంద్రం వద్ద కళాశాల అధికారులు అడ్డుకోవడంతో వారు వాగ్వాదానికి దిగారు. ఉడుపిలోని విద్యోదయ పియు కాలేజ్ వద్ద ఈసంఘటన చోటుచేసుకుంది. బురఖాతోనే తాము పరీక్ష రాస్తామంటూ వారు ఇన్విజిలేటర్లకు, కళాశాల ప్రిన్సిపాల్‌కు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు.
అయితే హిజాబ్‌ను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను కోర్టు కూడా సమర్థిస్తూ తీర్పు ఇవ్వడంతో తాము ఆ ఆదేశాలను అమలు చేయకతప్పదని ఆ విద్యార్థినులకు వారు తేల్చిచెప్పారు. దాదాపు ముప్పావు గంటపాటు ఆ విద్యార్థినులు వాదించి చివరకు పరీక్ష రాయకుండానే వెనుదిరిగారు. కాగా.. ఈ విషయంలో తప్పంతా ఆ ఇద్దరు విద్యార్థినులదేనని విద్యోదయ కాలేజ్ ప్రిన్సిపాల్ చెప్పారు. తాము నిబంధనలు పాటిస్తున్నామని, తాము ఎంత నచ్చచెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ఆ విద్యార్థినులు తమ మొండి పట్టుదలను విడనాడలేదని ఆయన చెప్పారు. పరీక్షలు రాసే ఉద్దేశం వారికి లేదని అర్థమైందని, ఏదో ఒక వివాదం సృష్టించాలన్నదే వారి ఉద్దేశంగా కనపడుతోందని ఆయన ఆరోపించారు. శుక్రవారం ప్రారంభమైన 12వ తరగతి ఫైనల్ పరీక్షలు మే 18వ తేదీ వరకు జరగనున్నాయి.