Thursday, January 23, 2025

భారత సంతతి శాస్త్రవేత్తలకు అమెరికా అత్యున్నత శాస్త్రీయ అవార్డులు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : ఇద్దరు భారతీయ సంతతి శాస్త్రవేత్తలకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. అశోక్ గాడ్గిల్ కు ప్రతిష్ఠాత్మక నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్, సుబ్ర సురేశ్‌కు నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ పురస్కారాలు దక్కాయి. మంగళవారం రోజున ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఈ పతకాలను అందజేశారు. అశోక్ గాడ్గిల్ ప్రస్తుతం కాలిఫోర్నియా వర్శిటీలో ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. లారెన్స్ బెర్కిలీ నేషనల్ ల్యాబ్‌లో సీనియర్ సైంటిస్టుగా ఉన్నారు.

సుస్థిర అభివృద్ధి రంగంలో ఆయన ఆవిష్కకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. తక్కువ వ్యయంతో కూడిన సురక్షిత తాగునీటి సాంకేతికతలు, సమర్థవంతమైన ఇంధన స్టవ్‌లు, విద్యుత్ దీపాల అభివృద్ధిలో కృషి చేశారు. ఆయన పరిశోధనా ఫలితాలు 10 కోట్లకు పైగా ప్రజలకు మేలు చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు జీవనాధార వనరులను అందించినందుకు గాను గాడ్గిల్‌కు ఈ అవార్డును అందించినట్టు వైట్‌హౌస్ తెలిపింది. ముంబైలో గాడ్గిల్ జన్మించారు. ముంబై వర్సిటీలో ఆయన ఫిజిక్స్ చదివారం. కాన్పూర్ ఐఐటీపీజీ చేశారు.

బెర్కిలీ లోని కాలిఫోర్నియా యూనివర్శిటీ నుంచి ఎంఎసీ, పీహెచ్‌డీ పూర్తి చేశారు. మరో శాస్త్రవేత్త ముంబైకి చెందిన సుబ్రా సురేశ్ 1956లో జన్మించారు. అమెరికాలో బయో ఇంజినీర్ చేస్తున్నారు. 1983లో బ్రౌన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో అతి పిన్నవయస్కుడైన ఫ్యాకల్టీ సభ్యుడిగా చేరారు. అనంతరం నేషనల్ సైన్స్‌ఫౌండేషన్ కు డైరెక్టర్ అయ్యారు. ఈ బాధ్యతలు చేపట్టిన తొలి ఆసియాఅమెరికన్ సురేశ్ కావడం విశేషం. గతంలో మాసాచుసెట్స్ టెక్నాలిజీ ఇన్స్‌టిట్యూట్‌లో డీన్‌గా చేశారు. ఇంజినీరింగ్, ఫిజికల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మెడిసిన్ రంగాల్లో పరిశోధన చేశారు. ఎంఐటీలో ఓ విభాగానికి అధిపతిగా పనిచేసిన తొలి ఆసియా వ్యక్తిగా సురేశ్ రికార్డు క్రియేట్ చేశారు. మద్రాస్ ఐఐటీలో బీటెక్ చేశారు.

ఐయోవా స్టేట్ వర్శిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేశారు. ఎంఐటీ నుంచే పీహెచ్‌డీ కూడా పూర్తి చేశారు. 2023లో బ్రౌన్ యూనివర్శిటీకి తిరిగి వచ్చారు. ఇంజినీరింగ్, ఫిజికల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్‌లో చేసిన పరిశోధనలు , ముఖ్యంగా మెటీరియల్ సైన్స్‌లో అధ్యయనానికి గుర్తింపుగా ఆయన నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్‌ను అందుకున్నారు. శాస్త్ర సాంకేతిక రంగానికి అసాధారణ రీతిలో సేవలందించినందుకు ప్రత్యేక గుర్తింపుగా అమెరికా ప్రభుత్వం నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అవార్డులను అందజేస్తుంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఉన్న సవాళ్లను వీరు ఎదుర్కొన్నారని, ఇన్నొవేటివ్ విధానాలతో సమస్యలను పరిష్కరించారని అమెరికా సర్కారు ఓ ప్రకటనలో తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News