హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం బిసిల సంక్షేమానికి రెండు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి ఆర్ధిక , విద్య, ఉద్యోగ, శిక్షణ, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో బిసి ప్రతినిధి బృందం బుధవారం ఢిల్లీలో కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రాందాస్ అద్వాలేను కలిసి వినతిపత్రం సమర్పించింది.
కేంద్ర ప్రభుత్వం గత 7 సంవత్సరాలుగా అమలు చేస్తున్న ఎస్‌షి, ఎస్‌టి, బిసి విద్యార్ధులకు కాలేజీ కోర్సు స్కాలర్ రేట్లు రెట్టింపు చేయాలని ఆర్ధిక పరిమితి పెంచాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాలలో ఉన్న మాదిరిగా ఫీజు రియింబర్స్ మెంట్ పధకాన్ని జాతీయ స్థాయిలో ప్రవేశ పెట్టాలని, జాతీయ స్థాయిలో కాలేజీ హాస్టళ్ళు , పాఠశాల హాస్టళ్ళు ప్రారంభించాలని, తెలుగు రాష్ట్రాల మాదిరిగా అన్ని రాష్ట్రాలలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని, కులవృత్తులు, చేతి వృత్తులు దిబ్బతింటున్న కారణంగా జాతీయ బి.సి కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్క కుటుంబానికి పది లక్షల రూపాయలు స్వయం ఉపాధి పధకాలకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని, కాలేజీ హాస్టళ్ళ భవన నిర్మాణాలకు గ్రాంటు మంజూరు చేయాలని బిసి నేతలకు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.
తెలుగు రాష్ట్రాలలోని సంక్షేమ పధకాలకు 80 శాతం గ్రాంటు కేంద్రం ఇవ్వాలని కోరారు. ఇందుకు కేంద్ర మంత్రి రాందాస్ అద్వాలే సానుకూలంగా స్పందించినట్లు ఆర్. కృష్ణయ్య తెలిపారు. బిజెపి ప్రభుత్వం కులాల వారిగా లెక్కలు తీయడానికి సుముఖంగా ఉందని, సంబంధిత అధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీనిచ్చినట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో – ఇతర కేంద్ర మంత్రులతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు వెల్లడించారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో జాతీయ బిసి సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, ఢిల్లీ అధికార ప్రతినిధి, ఇంచార్జ్ కర్రీ వేణుమాధవ్, దక్షిణాది రాష్ట్రాల బిసి సంక్షేమ సంఘం అద్యక్షులు జబ్బల శ్రీనివాస్, ఆంధ్ర ప్రదేష్ బిసి సంఘం రాష్ట్ర అధ్యక్షులు డా. ఎన్. మరేష్, డా. బత్తల వెంకటరమణ , బత్తల హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.